Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్‌ గహ్లోత్‌

29 Sep, 2022 15:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల్లో బిగ్‌ ట్విట్‌ చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజస్థాన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో తను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. 

ఈ మేరకు అశోక్‌ గహ్లోత్‌ గురువారం సోనిమా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్‌ ఎమ్మెల్యేల వ్యవహారంపై సోనియాకు క్షమాపణలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యే పోటీ ఉండనున్నట్లు తెలిపారు.

‘కొచ్చిలో నేను రాహుల్ గాంధీని కలిశాను. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించాను. అతను అంగీకరించలేదు. దీంతో నేను పోటీ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాజకీయ సంక్షోభంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. పార్టీ అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’ అని సోనియాతో భేటీ అనంతరం గహ్లోత్‌ వ్యాఖ్యానించారు.

 కాగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు.
చదవండి: యస్‌.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా

మరిన్ని వార్తలు