పార్టీ చాలా ఇచ్చింది.. ఏం అడిగినా చేసేందుకు రెడీ.. కానీ!

21 Sep, 2022 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గత 40-50 ఏళ్లుగా పార్టీలో తాను చాలా పదవులు చేపట్టానని, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అన్నీ ఇచ్చిందని గహ్లోత్‌ అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీ అప్పగించే బాధ్యతలను నిర్వర్తించడమే ముఖ్యమని  గహ్లోత్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం, కార్యకర్తలు తనను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని కోరితే తప్పకుండా చేస్తానన్నారు. ఒకవేళ సీఎంగా కొనసాగమంటే కూడా అలాగే చేస్తానని పేర్కొన్నారు.

అయితే చివరిప్రయత్నంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాహుల్ గాంధీని తాను మరోమారు కోరతానని గహ్లోత్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొంటే.. పార్టీకి సరికొత్త అధ్యాయం అవుతుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గాంధీల విధేయుడిగా అశోక్ గహ్లోత్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తే మాత్రం ఇద్దరూ తప్పుకునే అవకాశం ఉంది.
చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రాహుల్ గాంధీ విముఖత!

మరిన్ని వార్తలు