అన్నాడీఎంకే వర్సెస్‌ బీజేపీ

8 Jul, 2021 08:48 IST|Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే–బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు వివాదానికి దారి తీశాయి. బీజేపీతో పొత్తే అన్నాడీఎంకే కొంప ముంచినట్లుగా మాజీమంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్నాడీఎంకే పుణ్యమా అని తమ అభ్యర్థులు ఓడారని బీజేపీ సైతం ఎదురు దాడికి దిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమిగా ముందుకు సాగాయి. హ్యాట్రిక్‌  ధీమాతో ఉన్న అన్నాడీఎంకేకు ఈ ఎన్నికలు గట్టి దెబ్బతగిలేలా చేశాయి. ఈ పరిస్థితుల్లో విల్లుపురం వేదికగా బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో మాజీమంత్రి సీవీ షణ్ముగం బీజేపీపై విరుచుకుపడ్డారు.

సీవీ షణ్ముగం మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే అన్నాడీఎంకేకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. మైనారిటీల ఓటు బ్యాంక్‌ను చేజేతులా పూర్తిగా దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించిన బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ నేత రంగరాజన్‌ మాట్లాడుతూ అన్నాడీఎంకే పుణ్యమా అని తమ అభ్యర్థులు ఓడిపోయారని,ఎవరి ఓటమికి ఎవరు కారకులో స్పష్టం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొత్తు పదిలం..
అయితే సీవీ షణ్ముగం వ్యాఖ్యలు, ఆపై బీజేపీ ఎదురు దాడి నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధిష్టానం మీద తమకు అపార నమ్మకం ఉందన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, బీజేపీతోనే అన్నాడీఎంకే పయనం అని స్పష్టం చేశారు. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు