మహా కూటమిలో మాటల యుద్ధం

18 Jan, 2021 18:01 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ నగర పేరు మార్పు అంశం అధికార మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లో చిచ్చు రాజేస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన శివసేన, కాంగ్రెస్‌ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ పేరిట శంభాజీనగర్‌గా మార్చాలని శివసేన పట్టుబడుతోంది. ఇందుకు కాంగ్రెస్‌ ఒప్పుకోవడం లేదు. క్రూరుడు, మతోన్మాది అయిన మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబును అభిమానించడం లౌకికవాదం అనిపించుకోదని స్పష్టం చేస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఓ వ్యాసం రాశారు. ఔరంగాబాద్‌ పేరు మార్చడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అలా చేస్తే మైనార్టీ ఓటు బ్యాంకు దూరమవుతుందని ఆ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఔరంగజేబు సెక్యులర్‌ పాలకుడు కాదని తేల్చిచెప్పారు. (సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం)

ఛత్రపతి శంభాజీని చంపిన ఔరంగజేబు పేరు మహారాష్ట్రలో ఓ నగరానికి ఉండడానికి వీల్లేదన్నారు. పేరు మార్చాలనడం మతపరమైన అంశం కాదని, శివభక్తి అనిపించుకుంటుందని పేర్కొన్నారు. శివసేన వాదనలపై మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకుముందు మహారాష్ట్రలో బీజేపీ–శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పేరు మార్పు గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థిరమైన ఎంవీఏ ప్రభుత్వం ఉందన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) ఆధారంగానే పని చేస్తోందని తెలిపారు. నగరాల పేర్లు మార్చాలంటూ అనైతిక రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో సెంటిమెంట్‌ రాజకీయాలకు స్థానం లేదని వెల్లడించారు. పేరు మార్పు అంశం వల్ల మహా వికాస్‌ అఘాడీలో చీలికలు వస్తాయని ఎవరూ సంబర పడొద్దని పరోక్షంగా బీజేపీకి చురక అంటించారు.   
 

మరిన్ని వార్తలు