మాటల యుద్ధం: తోలు తీస్తాం.. నాలుక కోస్తాం

20 Jan, 2021 17:01 IST|Sakshi

బండి సంజయ్‌ లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శనాస్త్రాలు

కమలం పార్టీపై తీవ్ర పదజాలంతో దాడి..

సోషల్‌ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసిన అధికార పార్టీ

కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతున్న ‘టెక్‌సెల్‌’

సాక్షి, హైదరాబాద్ ‌: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్, బీజేపీ నడుమ మొదలైన విమర్శల పర్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నాటికి వేడెక్కి ప్రస్తుతం దూషణలు, సవాళ్ల దిశగా సాగుతోంది. మొదట్లో బీజేపీ నేతల విమర్శలు, సవాళ్లు, సోషల్‌ మీడియా ప్రచారంపై ఆచితూచి స్పందించిన టీఆర్‌ఎస్‌.. దాదాపు పక్షం రోజులుగా పదునైన మాటలతో సవాళ్లు విసురుతోంది. ‘బక్వాస్‌ జ్యాదా పార్టీ, బడా ఝూటా పార్టీ’అని బీజేపీకి కొత్త నిర్వచనాలు ఇస్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సవాళ్లు, దూషణల పర్వానికి దిగుతున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ప్రచారం ద్వారా జరిగిన నష్టాన్ని గుర్తించిన టీఆర్‌ఎస్‌.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ సోషల్‌ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసింది. పార్టీకి అనుబంధంగా టెక్‌సెల్‌ పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రంలో బీజేపీ పనితీరును సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతోంది. మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు బీజేపీపై ఎదురుదాడి వ్యూహాన్ని ముందుండి నడిపిస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. (సీఎం పీఠంపై కేటీఆర్: పెరుగుతున్న మద్దతు)

బండి సంజయ్‌ లక్ష్యంగా విమర్శలు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. సంజయ్‌ వ్యాఖ్యల్లో విమర్శలతో పాటు వాడుతున్న పదజాలంపై టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు జైలుకు వెళ్తారంటూ సంజయ్‌ చేస్తున్న విమర్శలపై అదే స్థాయిలో సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ‘మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేపై మాట్లాడితే అక్కడి కార్యకర్తలు ఊరుకుంటారా. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కార్యకర్తలు సహిస్తారా. మాటలు పడేందుకేనా కేసీఆర్‌ తెలంగాణ తెచ్చింది’అంటూ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఈ నెల మొదటి వారంలో బీజేపీపై ఎదురుదాడికి తెరతీశారు. మరుసటిరోజే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. వరంగల్, ఖమ్మం పర్యటనలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (పట్టభద్రుల కోటా.. పకడ్బందీగా పావులు)

తోలు తీస్తాం.. నాలుక కోస్తాం
తెలంగాణకు జాతిపిత లాంటి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే తోలు తీస్తామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వ్యాఖ్యానించగా, అసభ్యంగా మాట్లాడితే నాలుక కోస్తామంటూ మరో విప్‌ గువ్వల బాలరాజు హెచ్చరించారు. ‘పచ్చగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్‌ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు నెలలుగా ఓపిక పట్టాం. బండి సంజయ్‌ హెడ్‌లైన్స్‌ కోసం డెడ్‌లైన్స్‌ విధిస్తున్నారు’అంటూ విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో గాడ్సే వారసులు ఉన్నారంటూ పదునైన పదజాలంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడం, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి నిధులు రప్పించట్లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ లక్ష్యంగా కూడా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

సోషల్‌ మీడియాలోనూ దూకుడు
పార్టీకి అనుబంధంగా ఏర్పాటైన ‘టెక్‌సెల్‌’కు కన్వీనర్లను నియమించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పనితీరు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ విమర్శల దాడి పెంచింది. వ్యవసాయ చట్టాలు, ఢిల్లీలో రైతుల ఆందోళన, నల్లధనం, బ్యాంకు ఎగవేతదారులు, బీజేపీ ఎంపీలు, మంత్రులపై క్రిమినల్‌ కేసులు, బీజేపీలో కుటుంబ వారసత్వం వంటి అంశాలను సోషల్‌ మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ సైన్యం ఎండగడుతోంది. ఇన్నాళ్లూ అధికార పార్టీగా సంయమనం పాటించిన తాము రాజకీయ పార్టీగా బీజేపీ భాషలోనే సమాధానం చెబుతామని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు