చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?

18 Nov, 2022 17:48 IST|Sakshi

ఎన్నికలకు ముందే బాబుకు సీన్‌ అర్థమయిందా?

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన  రాజకీయ భవిష్యత్తు  గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. అక్కడితో ఆగలేదు. వచ్చేసారి అధికారం రాకపోతే రాజకీయాలలో ఉండలేనని కూడా ఆయన కడుపు చించేసుకున్నారు. దీని అర్థం ఏమిటి?
చదవండి: అబద్ధాలపై పేటెంట్‌ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించకపోతే జెండా పీకేయడమే అన్న అర్థం కూడా వస్తుంది. ఆయన ఆ మాట అనలేదు కాని, వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తాం అని ధీమాగా చెప్పలేకపోయారు. ఇది సహజంగానే తెలుగుదేశం వర్గాలకు ఇబ్బంది కలిగించే అంశమే. తమ పార్టీ విజయావకాశాలపై వారికే నమ్మకం సడలుతుంది. 

జనంతో బాబు ఆటలు
ఇంతకాలం చంద్రబాబు మేకపోతు గాంభీర్యంతో అయినా మాట్లాడేవారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన దానిని కూడా వదిలేశారు. ఆయన కావాలని అన్నారో, లేక తన మనసులో మాట అనుకోకుండా బయటకు వచ్చేసిందో కాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మాత్రం మంచి పాయింట్ అందించారు. దాంతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని, వచ్చే ఎన్నికలలో గెలవలేనని ఆయనే చెబుతున్నారని, ఈ నేపథ్యంలో పలు అబద్దాలతో పాటు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మధ్యలో తన భార్య ప్రస్తావన తేవడం, జరగని అవమానాన్ని జరిగినట్లుగా మళ్లీ పిక్చర్ ఇవ్వడం, వచ్చేసారి గెలవకపోతే రాజకీయాలలో ఉండలేనని అనడం.. అంతా సానుభూతి కోసమే అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

డామిట్‌.. నాడు కథ అడ్డం తిరిగింది.!
గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తేనే రాని సానుభూతి, ఇప్పడు ఆఖరి చాన్స్ అంటే వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాపం తెలుగుదేశం మీడియాకు చెందిన ఒకరు దానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు తనకు ఆఖరి చాన్స్ ఇవ్వాలని అనలేదని, ఆయన వ్యాఖ్యలకు అర్ధం ప్రజలకు చివరి చాన్స్ ఇవ్వడం అని చెబితే అందరూ దానిపై వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

సాధారణంగా వయసు మళ్లీనవారు తమ నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నప్పుడు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఈ ఒక్కసారికి గెలిపిస్తే, తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని వారు చెబుతుంటారు. ఆ ఎన్నిక ముగియగానే మళ్లీ మామూలే. ఆ వ్యక్తి గెలిస్తే ఐదేళ్ల తర్వాత యథాప్రకారం ఈ సారి ఖాయంగా తప్పుకుంటానని, ప్రజల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని అంటుంటారు. చివరికి ఓటమి ఎదురయ్యేదాక వారు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు కూడా అలాగే ఆఖరి చాన్స్ అనడం ద్వారా ప్రత్యర్ధులకు మంచి పాయింట్ అందించినట్లయింది. చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, అందుకే భయంతో ఇలా మాట్లాడారని వారు పేర్కొటున్నారు.

ఒక్క ఛాన్స్‌ ఎందుకివ్వాలి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. దీనిపై కూడా పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. టీడీపీతో కలవడంపై వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని, అందుకే తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని నిర్థారిస్తూ, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని, జనసేనతో కలిసే బీజేపీ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందని వారు  స్పష్టం చేశారు. దాంతో పవన్ కల్యాణ్ ఊబిలో  పడ్డయిట్లయింది.

పవన్ ఒక్క ఛాన్స్ అనడంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో తనకు ఆఖరు చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కానీ ఎక్కడా తాను ఏపీకి ఇంత మంచి చేశాను.. ఇంకా ఫలానా మంచి పనులు చేస్తానని చెప్పడం లేదు. పైగా ఇంత కాలం జగన్ అమలు చేసిన సంక్షేమ స్కీములను విమర్శిస్తూ మాట్లాడిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు మాటను పూర్తిగా మార్చి తాము ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు.

కర్నూలులో మాట మడత
ఏపీలో మూడు రాజధానుల వివాదం టీడీపీని ఒక కుదుపు కుదుపుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని, చంద్రబాబు అందుకు అడ్డుపడుతున్నారని న్యాయ వాదులు విమర్శిస్తున్నారు. వారు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.  దీనిని ఎదుర్కోవడం టీడీపీకి  ఒక పెద్ద సమస్యగా ఉంది. అందుకే చంద్రబాబు ఇంకో మాట చెబుతున్నారు. తనకు అధికారం ఇస్తే, ఐదేళ్లు పాలించి, ఆ తర్వాత పగ్గాలను వేరే వారికి అప్పగిస్తానని చెప్పారు. అంతే తప్ప తన కుమారుడు లోకేష్‌కు వారసత్వం ఇస్తానని చెప్పలేకపోయారు. లోకేష్ గురించి ప్రమోట్ చేస్తే అసలుకే మోసం వస్తుందేమోనన్న అనుమానం చంద్రబాబులో ఉండవచ్చు. లేక కొడుకు లోకేష్‌ సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉండడంతో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు.

ఒక సారి వెనక్కి చూడు బాబు.!
రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు. గత 70 ఏళ్లలో చంద్రబాబు కన్నా పలువురు సమర్ధులు ఏపీని పాలించారు. వారి ఆధ్వర్యంలోనే ప్రకాశం బారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు వచ్చాయి. వారెవరూ తాము లేకపోతే ఆంధ్రులు బతకలేరని చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం అంతా తనతోనే ఉందని భ్రమపడుతూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వర్తమాన సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త నేతలు పుట్టుకొస్తారు.

కానీ చంద్రబాబు మాత్రం తను అధికారంలోకి రాలేకపోతే ఏదో నష్టం జరుగుతుందని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనపై బురద జల్లేందుకు కష్టపడుతున్న చంద్రబాబు చివరికి ఆయన స్కీములనే అమలు చేస్తామని చెప్పే పరిస్థితిలో పడ్డారు. తద్వారా జగన్ సమర్థ పాలకుడని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు.

ఎవరి మ్యానిఫెస్టో మాయమయింది?
చంద్రబాబు గత శాసనసభ సమావేశాలకు వెళ్లలేదు. అంతమాత్రాన శాసనసభ ఆగిపోలేదు. ప్రభుత్వం నడుస్తూనే ఉంది. జగన్ తాను చేస్తానని చెప్పిన పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అన్ని ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. దాంతో చంద్రబాబులో భయం పట్టుకుని చివరి మాటగా ఆఖరి అవకాశం అన్న పదాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఓటమి చెందితే ఆయనకు అవి చివరి ఎన్నికలు అవ్వచ్చేమోకాని ప్రజలకు కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతూనే ఉంటారు.

మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో గెలిస్తే 30 ఏళ్లు తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే మాటను ప్రజలకు చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ మాటను, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేసి నిజంగానే ప్రజలపై చెరగని ముద్ర వేశారు.

చంద్రబాబు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2014కు ముందు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చని చంద్రబాబు.. ఏకంగా తమ మ్యానిఫెస్టోనే పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసింది. ఇప్పుడు ఆఖరు అవకాశం అనడం ద్వారా చంద్రబాబు ఆత్మ రక్షణలో పడితే 175 సీట్లకు, 175 గెలుస్తామని చెప్పడం ద్వారా జగన్ అఫెన్స్ గేమ్ ఆడి తన క్యాడర్‌లో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు