చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..

30 Jan, 2023 15:51 IST|Sakshi

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ, మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాళ్లది బోగస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసు పెట్టి కమలం పార్టీ ఏం సాధించిందని నీతిశ్ నిలదీశారు.

'మేం అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫాలోవర్లం. ఆయనతో అంతా బాగుండేది. 2017లో బీజేపీతో జట్టుకట్టాం. తర్వాత విడిపోయాం. నేను సీఎం కావాలనుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్లనే సీఎం పదవి చేపట్టమన్నా. కానీ నన్ను బలవంతంగా ముఖ్యమంత్రిని చేశారు.  ఆ తర్వాత ఎన్నికల్లో మేం ఎలా ఓడిపోయామో మా పార్టీ నేతలు వివరించారు. మా ప్రజల ఓట్లతో వాళ్లు గెలిచారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు బీహార్ ప్రజలంటే ఏంటో వాళ్లకు తెలుస్తుంది.' అని నితీశ్ అన్నారు.

'2005లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది. 2010లో ఎన్ని గెలిచింది. అప్పుడు ముస్లిం ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేశారు. 2015లో మాతో విడిపోయాక ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది? ఈసారి మా ఓట్లు వేయించుకుని మమ్మల్నే ఓడించింది.' అని నితీశ్ పేర్కొన్నారు.

తమకు అటల్ జీ, అద్వానీ అంటే అభిమానమేనని, కానీ ఇప్పుడున్న బీజేపీ పూర్తిగా వేరు అని నితీశ్ వివరించారు. ఈ నాయకులు వచ్చాక మొత్తం మారిందన్నారు. స్వాతంత్య్రం  కోసం పోరాటం చేసిన వారిని మర్చిపోవడం తగునా? అని నితీశ్ వ్యాఖ్యానించారు. 2024లో బిహార్‌లో 34 ఎంపీ సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నితీశ్ జోస్యం చెప్పారు. మరోవైపు తాము మరోసారి జేడీయూతో పొత్తు పెట్టకోవద్దని బిహార్ బీజేపీ తీర్మానించింది. నితీశ్‌కు మరోసారి మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పింది.
చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. మంచులోనే రాహుల్ ప్రసంగం

మరిన్ని వార్తలు