నేను సాఫ్ట్‌వేర్‌.. హార్డ్‌వేర్‌గా మార్చకండి

9 Jan, 2023 15:29 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తాను ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌లాగా పనిచేశానని, తనలో ఉన్న హార్డ్‌వేర్‌ను బయటకు తీయొద్దని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై హార్డ్‌వేర్‌ ప్రయోగిస్తానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారడానికి కార్యకర్తలు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి  పొందిందని చెప్పారు. వైరా నుంచి తిరిగి తనను రెండోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.

సమావేశంలో మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్, వైస్‌ ఛైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, బీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు దార్నా శేఖర్, బాణాల వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, డాక్టర్‌ కోటయ్య, పవిత్రకుమారి, లక్ష్మీబాయి, రామారావు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: (గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి)

మరిన్ని వార్తలు