కథ.. ​స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే..

28 Dec, 2022 07:42 IST|Sakshi
కోటనందూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడు

అశోక్‌ – బాబు కలయికతో మొదలైన గుబులు

తుని ‘దేశం’లో యనమల బ్రదర్స్‌ హైడ్రామా 

సీటు చేజారకూడదని ఎత్తుకు పైఎత్తులు 

అభిప్రాయ సేకరణ పేరుతో కొత్త పల్లవి 

అన్నదమ్ముల వ్యూహం ఏ తీరానికి చేరేనో!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాక పుట్టిస్తున్నాయి. రోజుకో చిత్రం మారుతూ పార్టీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. యనమల రామకృష్ణుడి సోదరుల కనుసన్నల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆ పార్టీ శ్రేణులే విస్తుపోతున్నాయి. టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి నాయకుడిగా క్యాడర్‌ చెప్పుకునే రామకృష్ణుడి వ్యాఖ్యలు, ఒంటిమామిడి, కోటనందూరు సమావేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ టికెట్‌ తమ కుటుంబం నుంచి చేజారిపోకూడదనే అంతర్గత అజెండాయే మాజీ మంత్రి వ్యూహమనే విషయంపై చర్చలు సాగుతున్నాయి.

ఆ లీకుల వెనుక కారణమిదీ.. 
అందరి అభిప్రాయాలూ సేకరించి, అధిష్టానం ముందుంచుతానని వైఆర్‌కే చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కృష్ణుడికే టికెట్‌ ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్ల ఫోన్‌ సంభాషణలను సామాజిక మాధ్యమాలతో పాటు పలు చానెల్స్‌కు వ్యూహాత్మకంగా లీకులు ఇచ్చి ప్రచారం చేశారని చెబుతున్నారు. అధిష్టానం దృష్టికి ఈ రకంగా తీసుకువెళ్లాలన్నదే దీని వెనుక అసలు వ్యూహమని అంటున్నారు.

ఇందుకు కొనసాగింపుగా ఒంటిమామిడి మొదలు కోటనందూరు వరకూ జరిగిన సమావేశాల్లో కృష్ణుడికే సీటు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపించింది. ఇది కూడా యనమల రాజకీయ డ్రామా అని తెలుస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది వర్కవుట్‌ కాకుంటే చివర్లో తన కుమార్తెను తెర మీదకు తీసుకు రావాలనే ఆలోచన కూడా రామకృష్ణుడి మదిలో ఉందంటున్నారు.  తుని సీటు తమ కుటుంబం చేజారి పోకూడదనే అంతర్గత అజెండా బయట పడకుండా కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరిట జరుపుతున్న అన్నదమ్ముల వ్యూహాత్మక రాజకీయం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే.

ప్రత్యామ్నాయంపై ఫోకస్‌ 
తుని అంటే యనమల సోదరులు.. వారంటేనే తుని.. అన్నట్టుగా నాలుగు దశాబ్దాల పాటు సాగిన రాజకీయం ముగింపు దశకు చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కృష్ణుడికి సీటు లేనట్టేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. యనమల కుటుంబానికి ప్రత్యామ్నాయంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు పేరును పరిశీలిస్తున్నట్లు తాజాగా తెర పైకి వచ్చింది. చంద్రబాబుతో అశోక్‌బాబు భేటీకి కారణం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. అశోక్‌బాబుతో పాటు వెలమ సామాజికవర్గం నుంచి సుర్ల లోవరాజు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తుని టికెట్‌ తమ కుటుంబం చేయి దాటిపోకుండా యనమల సోదరులు ద్విముఖ వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం తుని కార్యకర్తల సమావేశంలో తనకు వయస్సు మీరిపోయినందున బరి నుంచి తప్పుకోక తప్పదని కృష్ణుడికి వైఆర్‌కే (యనమల రామకృష్ణుడు) పరోక్ష సంకేతాలు ఇచ్చారు. పార్టీ కంచుకోట కోన ప్రాంతంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతితో ఆ గ్రామాలు దాదాపు టీడీపీకి దూరమయ్యాయి.

అన్నీ వ్యూహంలో భాగమే..
తుని బరిలో యనమల సోదరుల్లో ఎవరు దిగినా గత ఫలితాలే పునరావృతమవుతాయన్నది విశ్లేషకుల మాట. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే యనమల కుటుంబానికి కాకుండా ప్రత్యామ్నాయ నేతలకు టికెట్‌ కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు భోగట్టా. దీనిపై గోప్యత ప్రదర్శిస్తూ టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి గెలిపించుకోవాలని ఐదు రోజులుగా వరుస సమావేశాలలో క్యాడర్‌కు వైఆర్‌కే చెబుతూ వస్తున్నారు.

బాబు ఎలాగూ దూరం పెడతారనే ముందు చూపుతో తామే తప్పుకుంటామనే ప్రచారాన్ని తొలుత అనుయాయుల ద్వారా తెర మీదకు తీసుకువచ్చారు. ఈ అంశంపై ‘అన్నదమ్ముల అస్త్రసన్యాసం’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పని చేయాలంటూ యనమల బ్రదర్స్‌ బయటకు చెబుతున్నా తమ కుటుంబం చేతుల నుంచి సీటు దాటి పోకుండా పావులు కదుపుతున్నట్టు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు