హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో సీఎం కేసీఆర్‌!

2 Jul, 2022 11:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం.

శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్‌, మం‍త్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ  సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్‌ ప్రకారం.. సీఎం కేసీఆర్‌ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. ఈ తరుణంలో.. యశ్వంత్‌ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్‌ఎస్‌ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.

మరిన్ని వార్తలు