CM KCR Jalavihar Speech: యశ్వంత్‌ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్‌ ఫైర్

2 Jul, 2022 13:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, భారత రాజకీయాల్లో యశ్వంత్‌ సిన్హా గొప్ప వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్‌కు స్వాగతం. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హా గొప్ప వ్యక్తి. న్యాయవాదిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారిగా ఆపై రాజకీయ వేత్తగా ఎదిగారు.  అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు.  దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్‌ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌. 

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టం. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్‌ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉంది.  ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు.. తద్వారా దేశ గౌరవం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. 

మోదీపై విసుర్లు
ప్రధాని మోదీ రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండబోతున్నారు. రేపు ఆయన సభలో మా గురించి బాగా మాట్లాడబోతున్నారు. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారు. మోదీ తనను తాను అత్యంత మేధావిగా భావిస్తారు. ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు మాట్లాడతారు. రేపు మోదీ తన ప్రసంగంతో నన్ను చీల్చి చెండాడబోతున్నారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు విబేధాలు లేవు. మీలో ప్రవహించే రక్తంలో కొం‍తైనా నిజాయితీ ఉంటే.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? రైతులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులుగా కనిపిస్తున్నారా?. రైతులను ఉగ్రవాదులు, ఖలీస్థానీలు అన్నారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారు?. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు.. అది జరగలేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. దేశం ముందు మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి..) తలదించుకున్నారు. దేశ ప్రజలను తల దించుకునేలా చేశారు.

మీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఇలా.. ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లినప్పుడు.. ప్రధానిలా కాకుండా సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరించారు. మీరు దోషి కాకుంటే రేపటి సభలో సమాధానం ఇవ్వండి. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశం నుంచి పెద్ద కంపెనీలు వెళ్లిపోతున్నాయి. మేం మౌనంగా ఉండం.. పోరాటాలు చేస్తాం. ప్రసంగాలు కాదు.. మేం అడిగేవాటికి సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు