రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా! టీఎంసీకి రాజీనామా

21 Jun, 2022 11:37 IST|Sakshi

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో విపక్షాలు తడబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ముగ్గురుకి ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులు.. రేసు నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలో అభ్యర్థి ఎవరన్నదానిపై ఇవాళ(మంగళవారం) సాయంత్రం లోగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో అభ్యర్థి రేసులో మరొక పేరు తెరపైకి వచ్చింది. 

కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ ప్రస్తుత నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ సిన్హా.. పార్టీకి రాజీనామా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. 

టీఎంసీలో మమతాగారు(మమతా బెనర్జీని ఉద్దేశించి..) నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు ఆయన. ఇదిలా ఉండగా.. యశ్వంత్‌ సిన్హా ట్వీట్‌తో ఆయన రాష్ట్రపతి రేసులో నిలవడం దాదాపు ఖాయమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్డీయే తరపు అభ్యర్థి విషయంలోనూ ఇవాళ ప్రధాని మోదీ భేటీ తర్వాత ఒక స్పష్టత రావొచ్చు.

బీహార్‌, పాట్నాలో పుట్టిపెరిగిన యశ్వంత్‌ సిన్హా..  ఐఏఎస్‌ అధికారి. ఆపై దౌత్య వేత్తగానూ తరపున పని చేశారు. సర్వీస్సులో ఉండగానే రాజీనామా చేసిన ఆయన 1984లో జనతా పార్టీలో చేరారు. నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్‌ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్‌ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్‌ సిన్హా.. 22 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీ పాలనను బహిరంగంగానే విమర్శిస్తూ పార్టీని వీడి.. కిందటి ఏడాది టీఎంసీలో చేరారు. 

మరిన్ని వార్తలు