తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..?

7 Nov, 2022 18:38 IST|Sakshi

అప్పులపై ఈనాడు ఎన్ని సార్లు వార్తలు ఇచ్చిందో చెప్పలేం. చివరికి ఓడరేవుల అభివృద్దికి అప్పు ప్రతిపాదన చేసినా తప్పు పడుతున్నారు. ఓడరేవులు అభివృద్ధి చెందితే అది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దానిని చెడగొట్టడానికి ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు ఇస్తున్నాయని ప్రజలు అర్ధం చేసుకోలేరనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. హంద్రీనీవాలో నీరున్నా రైతుకు కన్నీరే అంటూ మరో  విషపూరిత కథనాన్ని ఈనాడు ఇచ్చింది.
చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?

నిజంగానే ఎక్కడైనా పొలాలకు సరిగా నీరు అందకపోతే వార్త ఇవ్వవచ్చు. అలా కాకుండా రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఆత్మగౌరవ ర్యాలీలు జరుగుతున్న వేళ  ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే లక్ష్యంతో ఇలాంటి కథనాలు ఇస్తున్నారు. ఈ వార్త అబద్దమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి సోదాహరణంగా వివరించారు.

తప్పుదారి పట్టించే యత్నం
ఒకవేళ నిజంగానే లక్ష ఎకరాల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా? ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం ఎంత గొడవ చేసేది? ఈనాడు మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. రిజర్వాయిర్లు, చెరువులు అన్నిటా నీరు ఉంది. అలాంటప్పడు నీటి సమస్య ఎక్కడ వస్తుంది? విద్యుత్ బకాయిల చెల్లించలేదంటూ రాసిన ఈ పత్రిక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టులు, ఇతర లిఫ్టుల విద్యుత్ బకాయిల గురించి ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా అంటే అదేమీ చేయలేదు. ఇక్కడ ఆ మీడియాకు ఉన్న భయం ఏమిటో వారే చెప్పాలి.

నిజం తెలిసినా వక్రభాష్యమే.!
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తూ మాస్టర్ ప్లాన్ మార్చేస్తున్నారు అంటూ వార్త ఇచ్చింది. ఆయువు తీస్తున్న విద్యుత్ తీగలు అంటూ అప్పుడెప్పుడో జరిగిన ఘటనల ఆధారంగా ఒక స్టోరీ వండారు. ఇది కూడా నిజంగా సమస్య పరిష్కారం కోసం కాకుండా, ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే చేశారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.

మరో వైపు గ్రామాలలో విద్యుత్ బకాయిలు చెల్లించకూడదన్నట్లుగా వార్తలు ఇస్తూ సర్పంచ్లపై కత్తీ అంటూ మరో అధ్వాన్నపు వార్త ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేకపోయాయి. కాని ఏపీలో మాత్రం ఉద్యోగులను రెచ్చగొట్టే రీతిలో కధనాలు ఇచ్చాయి. అప్పు తెచ్చి జీతాలు ఇస్తే అదిగో అప్పు చేశారని రాశారు. అంతేకాదు .. ఈనాడు ఒకసారి అసలు ఏపీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కూడా వార్త ఇచ్చింది.  

రాతలు కావవి.. పచ్చ కామెర్లు.!
కరోనా సమయంలో పేదలకు సాయం చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ వార్తలు ఇవ్వలేదు. పైగా అమ్మో అప్పులు చేసేశారు అంటూ వ్యతిరేక ప్రచారం చేశారు. పోనీ ప్రభుత్వం వ్యయం తగ్గించుకోవడానికి, స్కీములలో వృధా అరికట్టడానికి ప్రయత్నిస్తే, వెంటనే ఆ స్కీములో కోత పెట్టారు! ఈ స్కీములో కోత పెట్టారు అంటూ అప్పుడు కధనాలు ఇచ్చారు. విశాఖలో టిడిపి ఆందోళనకు దిగితే పోలీసులు కట్టడి చేస్తే నిర్భంధ కాండ అంటూ తాటికాయంత అక్షరాల హెడింగ్ ఇచ్చారు. మరి అదే అమరావతిలో భూముల సమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినప్పుడు, విపక్షాలు ఆ ప్రాంతం వైపు వెళ్లకుండా ఆంక్షలు పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇలా రాశారా? ఆనాటి ప్రభుత్వమే రైతుల పంటలను కూడా తగుల పెట్టించదన్న ఆరోపణ వచ్చినప్పుడు ఈ మీడియా ఏనాడైనా ఇది దారుణం అని రాసిందా?

మీరా విలువలా గురించి వల్లించేది?
ఎప్పుడైనా ఒకసారి ఏడిస్తే ఎవరైనా ఓదార్చుతారు. కాని రోజు ఏడ్చేవారిని ఎవరు ఓదార్చుతారన్నది నానుడి. సరిగ్గా ప్రస్తుతం ఈనాడు, ఇతర టీడీపీ మీడియా సంస్థల పరిస్థితి అలాగే ఉంది. రోజూ ప్రభుత్వంపై ఏదో ఒక చెత్తరాసి, ఇంత బురద పోసి ఈ మీడియా ఆనందపడుతోంది. వీరి బాధ అల్లా  ఎన్ని రాసినా ప్రజలలో ప్రభుత్వంపై తాము ఆశించిన వ్యతిరేకత రావడం లేదనే. అందుకే మరింత ప్రస్టేషన్ తో  ఈనాడు, టీడీపీ మీడియా ఇలా చేస్తున్నాయి.

ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు సమాజ విలువల గురించి, పత్రిక ప్రమాణాలు, విలువల గురించి సంపాదకీయాలే కాదు.. ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. ఏదైనా నిజమైతేనే రాయండి.. అబద్దమైతే రాయవద్దని సుద్దులు చెప్పేవారు. ఏ ఆరోపణపైన అయినా రెండో వెర్షన్ తీసుకోవాలని చెప్పేవారు.  కాని ఇప్పుడు ఆయన సారధ్యంలోని ఈనాడు ఇంత ఘోరంగా విలువలకు పాతర వేస్తున్న తీరు చూస్తే, ఆనాటి మాటలన్నీ ఒట్టి మాటలేనా అన్న భావన ఏర్పడుతుంది. చివరికి ఈనాడు సైతం కులం ఊబిలో చిక్కుకుందన్న విమర్శలు రావడం అత్యంత శోచనీయం. వీటన్నిటిని గమనిస్తే వచ్చే 2024 ఎన్నికల వరకు జగన్ ప్రభుత్వం ఈ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోకతప్పదని అర్థం అవుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు