ఏది నిజం?: తడబాటు కాదు... అధికారపు ఎడబాటు

2 Aug, 2022 12:10 IST|Sakshi
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జెడ్పీ హైస్కూల్‌

స్కూళ్ల మ్యాపింగ్‌పై ‘ఈనాడు’ అడ్డగోలు రాతలు

పనులు జరుగుతున్న వేళ... తాత్కాలికంగా కొన్నిచోట్ల సర్దుబాటు

ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు, చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా?

అంగన్‌వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్‌ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్‌ డాన్‌ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్‌ గానీ, ప్లేగ్రౌండ్‌ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే  స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్‌జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు. 

అప్పర్‌ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్‌ అకడమిక్‌ సర్వే (న్యాస్‌), ప్రథమ్‌ సంస్థ చేసిన ‘అసర్‌’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే.

విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్‌ వేసి, తమ కార్పొరేట్‌ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్‌ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి...  కాపీయింగ్‌ను ప్రోత్సహించి మరీ టెన్త్‌లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్‌ చైల్డ్‌లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం. 

మొత్తం వ్యవస్థకే చికిత్స...!
ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్‌ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది.

మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం...
నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది.

గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్‌సీఈఆర్‌టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్‌ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ ఆన్‌లైన్‌ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే.

దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్‌ఈకి (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి.

సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి?  ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..?

అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు?

ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్‌ తీరు
► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్‌ అభివృద్ధి ఎక్కువ కనక...  ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్‌ స్కూళ్లుగా మారుస్తున్నారు. 

► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ.  పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన  మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ.

మిగిలిన స్కూళ్లు సైతం...
శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్‌గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్‌ ప్రభుత్వానికి... అసలు ఈ  దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం.

► ఇక మ్యాపింగ్‌ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్‌ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్‌ అసిస్టెంటు స్థాయికి అప్‌గ్రేడ్‌ చేపట్టింది.

ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు...
సోమవారంనాడు ప్రచురించిన ఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ...


► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్‌కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్‌ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్‌ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని 
ఆహ్వానించారు. 

► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్‌ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట. 

► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే.  నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు  చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది.  

మరిన్ని వార్తలు