వారి కోసం బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి.. సీఎం యోగి వార్నింగ్‌

18 Feb, 2022 20:04 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య విమ‍ర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అయితే, అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్​డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్​డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు బుల్​డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప‍్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని రిపేర్‌ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం  జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ‍్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది.
 

>
మరిన్ని వార్తలు