దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి.. మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

8 Sep, 2022 03:44 IST|Sakshi

దుష్టచతుష్టయం తీరును, వాస్తవాలను ప్రజలకు వివరించండి

చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రలను బహిర్గతం చేయండి: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియాతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించి, దుష్టచతుష్టయం కుట్రలను బహిర్గతం చేయాలని ఉద్బోధించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు బయటకువెళ్లారు.

ఆ తర్వాత మంత్రులతో రాజకీయ పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని.. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.70 లక్షల కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రమాణికంగా.. అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాల ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు.

జీఎస్‌డీపీలో అగ్రగామిగా ఉన్నాం
స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, 11.43 శాతం వృద్ధి రేటు సాధించిందని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. దాంతో ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. వరుసగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడమే అందుకు నిదర్శనమన్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడులతో కూడిన దుష్టచతుష్టయం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. అదే నిజమని ప్రజలను నమ్మించేలా  సమన్వయంతో దుష్ఫ్రచారాన్ని చేస్తోందని ఎత్తిచూపారు.

వీరికి దత్తపుత్రుడు కూడా తోడయ్యారని గుర్తు చేశారు. అభూత కల్పనలు, అవాస్తవాలతో ప్రభుత్వంపై బురదజల్లుతూ.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. దుష్టచతుష్టయం కుట్రలను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. నిజాలను మనం ప్రజలకు వెల్లడించకపోతే.. దుష్టచతుష్టయం చేస్తున్న అసత్య ప్రచారమే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు వివరించి చైతన్య పరచాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు