‘ధాన్యం కొనడం చేతకాని సీఎంను గద్దె దించాలి’

11 Apr, 2022 01:12 IST|Sakshi

గార్ల: ధాన్యం కొనడం చేత గాని సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రస్థానం పాదయా త్రలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు మీదుగా ఆమె ఆదివారం మహబూబా బాద్‌ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రైతుదీక్ష చేపట్టారు. దీక్షనుద్దేశించి ఆమె మాట్లాడుతూ గతేడాది యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సీఎం కేసీఆర్‌ వరి పంట సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంట వేశారన్నారు.

మిగతా 17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయకుండా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గతంలో కేంద్రంతో స్నేహంగా ఉన్నప్పుడు సీఎం బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమంటూ ఒప్పందంపై ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఆ ఒప్పందం మేరకే కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ వద్దంటోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చు కునేందుకు రాష్ట్రంలో దొంగ ధర్నాలు, ఆందోళనలు చేపడుతోందని షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు