ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్‌ షర్మిల

16 Apr, 2021 02:26 IST|Sakshi
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్‌ షర్మిల. చిత్రంలో వైఎస్‌ విజయమ్మ

ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష     

వైఎస్‌ విజయమ్మ, ఆర్‌.కృష్ణయ్య తదితరుల హాజరు

లోటస్‌పాండ్‌కు పాదయాత్ర భగ్నం.. స్పృహ తప్పిన షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, ప్రతి ఒక్క ఖాళీని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ గురువారం నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్‌ విజయమ్మ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ఐజేయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ జిల్లాల, వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు, పలు జిల్లాల నుంచి షర్మిల పార్టీ నేతలు, అనుచరులు పాల్గొని మద్దతు తెలిపారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం షర్మిల మాట్లాడారు. 


40 లక్షల మంది ఎదురుచూపులు
ప్రత్యేక తెలంగాణ సాధన పోరాటంలో ముందున్న విద్యార్థులు, యువకులు ఈరోజు ఉద్యోగాల్లేక, కుటుంబాలను పోషించలేక, పెళ్లిళ్లు కాక ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి సునీల్‌నాయక్, సిరిసిల్లలో మహేందర్‌యాదవ్‌లు ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో.. చందమామల్లాంటి మన పిల్లలు ఉద్యోగాల్లేక చనిపోతున్నారని మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇంతమంది చనిపోతుంటే కన్పించడం లేదా? అని నిలదీశారు. దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్‌ కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలన్నారు.కేసీఆర్‌ది గుండెనా? బండరాయా? అని ప్రశ్నించారు. దీక్షలో ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న, పిట్టా రామిరెడ్డి, ర్యాలీ చంద్రశేఖర్‌రాజు, వినోద్, వాడుక రాజగోపాల్, ఓయూ విద్యార్థి జేఏసీ నేత నవీన్‌యాదవ్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నేత సాయి, బి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్‌కే భవన్‌ వద్ద లాఠీఛార్జ్‌
ఇందిరా పార్క్‌ వద్ద దీక్షను కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడంతో, లోటస్‌పాండ్‌ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్‌ షర్మిల ధర్నా చౌక్‌ నుంచి పాదయాత్ర చేపట్టారు. అయితే బీఆర్‌కే భవన్‌ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో ఆమె స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు దొరికినవారిని వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లారు. అనంతరం షర్మిలను లోటస్‌పాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కార్యకర్తలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ ప్రాంతంలోనే వదిలిపెట్టారు. 

న్యాయం జరిగే వరకు పోరాటం
లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగించిన షర్మిల.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. తనకు గాయం అయ్యిందంటూ, తనపై మరోసారి చేయిపడితే ఊరుకోబోనని హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 

చదవండి: వైఎస్‌ షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు