యువతను బలిపీఠం ఎక్కిస్తున్నారు: వైఎస్‌ షర్మిల

25 Aug, 2021 01:48 IST|Sakshi
దీక్షా సభలో మాట్లాడుతున్న షర్మిల

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజం

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష

దండేపల్లి (మంచిర్యాల): టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎంతోమంది నిరుద్యోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల హంతకుడిగా తయారయ్యారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆమె మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 10:30 గంటలకు దీక్షలో కూర్చుని సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఉద్యమ ఆకాంక్షలను గౌరవించి కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే, ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థులు, యువకులను బలిపీఠం ఎక్కిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే, దున్నపోతు మీద వాన పడినట్లుగా, చచ్చేవాడు నా వాడు కాదు కదా.. నాకేం సంబంధం.. నా ఇంట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు ఉన్నాయి అని కేసీఆర్‌ మురిసిపోతున్నాడని ధ్వజమెత్తారు.

ఫాంహౌజ్‌లో మత్తు నిద్రలో ఉన్న కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో కూడా తెలియదని విమర్శించారు. నిరుద్యోగులెవరూ ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకోవద్దని, నిరుద్యోగులకు అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. దీక్ష వద్దకు ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు వచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఎల్లాంరానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుశనపల్లి సత్తయ్య చనిపోవడంతో ఆయన కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న ఆటాపాటా ఎంతగానో అలరించాయి. కార్యక్రమ కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్, పార్టీ రాష్ట్ర నాయకులు భూమిరెడ్డి, సంజీవ్, రమేష్, సత్యవతి, చంద్రశేఖర్, జిమ్మిబాబు, సత్యం, గణేష్‌నాయక్, ప్రకాశ్, మంగిలాల్, అజీమ్, లక్ష్మారెడ్డి, వైఎస్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు