రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌

16 Jun, 2022 01:15 IST|Sakshi
ప్రజాప్రస్థానం పాదయాత్రలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

చింతకాని: తెలంగాణ ఏర్పడినపుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండగా... స్వప్రయోజనాలు, ఆడంబరాలతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కొనసాగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్‌ను నమ్మి రెండు సార్లు అధికారం కట్టబెడితే ఆయన కుటుంబం తప్ప ఏ వర్గం ప్రజలూ బాగుపడలేదని మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానాలన్నీ విస్మరించిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ పేద ప్రజలకు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే, కేసీఆర్‌ ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ... ఇలా ఏ వాగ్దానాన్నీ అమలుచేయని కేసీఆర్‌ అసమర్థ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ వస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలకు బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు