YS Sharmila On CM KCR: బార్ల తెలంగాణగా మార్చారు

25 Jun, 2022 01:40 IST|Sakshi
చిలుకూరు మండలంలో మాట్లాడుతున్న షర్మిల

కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

కోదాడ: బాధల తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్‌ మాటలు నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే వీధికో బెల్టు షాపు తెరిచి బార్ల తెలంగాణగా మార్చారని, అలాంటి ఆయనను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండలంలో పర్యటించారు.

ఆమె మాట్లాడుతూ డబుల్‌ బెడ్రూం ఇళ్లకు, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూములు లేకున్నా టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి రూ. 100 కోట్ల భూమిని కేటాయించడానికి మాత్రం కేసీఆర్‌కు భూములు ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ గత ఎనిమిదేళ్లుగా ఎన్ని డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. ‘మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి, గాడిదకు రంగుపూసి ఆవు అని కేసీఆర్‌ నమ్మిస్తారు.

ఈ విషయంలో ఆయనపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు. తమ పార్టీని ఆదరిస్తే అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు రుణాలు ఇస్తామని, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు