నియంత పాలన అంతమొందించాలి

26 Jun, 2022 01:07 IST|Sakshi
తంగెళ్లగూడెంలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

పెన్‌పహాడ్‌(సూర్యాపేట): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్న నియంత పాలనను అంతమొందించాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపుని చ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శనివారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం తంగెళ్లగూడెం, చీదెళ్ల, గాజుల మల్కాపురం, అనిరెడ్డిగూడెం, నూర్జహాన్‌పేట గ్రామాల్లో సాగింది.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణలో సామాన్యులకు కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలపై దృష్టిసారించకుండా మాటలతో మభ్యపెట్టి కాలం గడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్‌ కలిగిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రంలో బడులు, దేవాలయాల కన్నా బార్లు, మద్యం షాపులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, పాలేరు నియోజకవర్గ పరిశీలకుడు బీరవోలు శ్రీనివాస్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిపాల వేణుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు