అభివృద్ధి విస్మరించి.. ధరలు పెంచారు 

28 Jun, 2022 01:49 IST|Sakshi
దురాజ్‌పల్లిలో మహిళలతో షర్మిల కరచాలనం

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

చివ్వెంల (సూర్యాపేట): సీఎం కేసీఆర్‌కు రెండుసార్లు ఓటు వేస్తే అభివృద్ధి చేయడం మరిచి ధరలు పెంచారని, ప్రజలను ఆదుకోరు కానీ పన్నులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణలో అందరూ కోటీశ్వరులయ్యారని, రైతులు కార్లలో తిరుగుతున్నారని కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం షర్మిల సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఆందోళనతోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని తెలిపారు. పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ సంకన ఎక్కిందని, బీజేపీ ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

‘నేను కుటుంబాన్ని, ఇంటిని వదిలేసి ఎండనక, వాననక పాదయాత్ర చేస్తున్నది వైఎస్సార్‌ పాలన కోసమే. కేవలం వైఎస్సార్‌ను ప్రేమించిన ప్రజలు ఆగం అవుతున్నారని, పార్టీ పెట్టాను. వైఎస్సార్‌ ప్రతి పథకాన్ని అమలు చేస్తా’ అని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక మాఫియా అని, కాంట్రాక్టులన్నీ ఆయనవే అని షర్మిల ఆరోపించారు.  

మరిన్ని వార్తలు