కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ: వైఎస్‌ షర్మిల

1 Sep, 2021 04:21 IST|Sakshi
అనంతరావుపల్లికి చెందిన కొప్పు రాజు కుటుంబాన్ని ఓదారుస్తున్న వైఎస్‌ షర్మిల 

గజ్వేల్‌ నిరుద్యోగదీక్షలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల  

గజ్వేల్‌: తాలిబన్ల చెరలో అఫ్గానిస్తాన్‌ బాధలు పడుతున్నవిధంగానే సీఎం కేసీఆర్‌ చేతిలో తెలంగాణ బందీగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు గజ్వేల్‌ మండలం అనంతరావుపల్లికి చెం దిన కొప్పు రాజు కుటుంబీకులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఉద్యోగం రావడంలేదనే బాధతో 7 నెలల క్రితం రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాలోని వైఎస్సార్‌ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షాస్థలికి చేరుకుని దీక్షను కొనసాగించారు.

కొప్పు రాజు తల్లిదండ్రులు లక్ష్మి–సత్తయ్యలు సాయంత్రం షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ‘టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, అలాంటప్పుడు కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..’అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఖాళీ పోస్టుల సంఖ్య 3.80 లక్షలకు పెరిగినా, ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో మనోస్థైర్యాన్ని కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వం ఉన్నా, లేకున్నా, ఒక్కటేనని చెప్పారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, వారి తరపున పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. 

 హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలి... 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు భారీగా నామినేషన్లు వేయాలని, నిజామాబాద్‌లో కవితను ఓడించినట్లే, హుజూరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ను ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు. 

ఉచిత కరెంటు వైఎస్‌ ఘనతే
రాష్ట్రంలో 64 లక్షల మందిని రుణవిముక్తులను చేయడమేగాకుండా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందని షర్మిల అన్నారు. వైఎస్‌ వల్ల లక్ష లాది మంది విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఆనందంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ‘అందరూ రెండేళ్లు ఓపిక పట్టండి... సంక్షేమ రాజ్యం వస్తుంది’అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న ఆటపాటలు విశేషం గా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యవతి, పిట్ట రాంరెడ్డి, సంజీవరావు, తిరుపతిరెడ్డి, అమృతసాగర్, లెక్చరర్‌ సాహితి, నంబూరి రామలింగేశ్వర్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు