వరి పండించొద్దు అనే అధికారం నీకెక్కడిది: వైఎస్‌ షర్మిల

29 Mar, 2022 19:46 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: నిరుద్యోగుల పక్షాన మేము దీక్ష చేస్తే కానీ విపక్షాలకు సోయి, ప్రభుత్వానికి బుద్ధి రాలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం రోజున చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు.

'రాష్ట్రంలో మూడు లక్షల తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికుంది, బస్వాల్‌ కమిటీ కూడా అదే చెప్పింది. 89 వేల ఉద్యోగాల ఖాళీ లెక్క మీరు ఎవరిచ్చారు. ఏ నిరుద్యోగి అడగక ముందే నిరుద్యోగ భృతి 3,116 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కేసీఆర్‌ మాటిచ్చి 40 నెలలు గడుస్తోంది. ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి అమలు కాలేదు. అంటే ప్రతి నిరుద్యోగికి ఈ 40 నెలల కాలంలో మీరు లక్షా ఇరవై వేల రూపాయలు నిరుద్యోగభృతి ఇవ్వాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నాం. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వారంగా ప్రకటించి దీక్ష చేస్తున్న.

చదవండి: (కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త)

కేసీఆర్‌ పండించిన ప్రతి వరి గింజ కొంటానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు పంట వద్దు అంటున్నాడు. వరి పండించొద్దు అనే అధికారం నీకెక్కడిది. కేసీఆర్‌ మెడలు వంచయినా సరే వడ్లు కొనిపిస్తాం. ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే వడ్లు కొనేదాకా పోరాడదాం. తెలంగాణ తల్లి సాక్షిగా ఇందిరా పార్కు వద్ద మూడు రోజులు నిరాహార దీక్ష చేయాలని నిరుద్యోగ పక్షాన దీక్ష చేస్తుంటే గాయపరచి దీక్ష భగ్నం చేశారు. అయినా దీక్ష కొనసాగించాం. 10 లక్షల మంది కార్పొరేషన్ లోన్లు పెట్టుకుంటే వాళ్లకు ఇవ్వడం చేతకాలేదు. కేసీఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఉంటే ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేవారూ కాదు. నీకు చేత కాకుంటే పక్కకు తప్పుకొని ఒక దళితున్ని ముఖ్యమంత్రి చేయమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం' అని వైఎస్‌ షర్మిల అన్నారు. 

మరిన్ని వార్తలు