హైదరాబాద్‌ నేతలతో వైఎస్‌ షర్మిల భేటీ

20 Feb, 2021 14:10 IST|Sakshi

వైఎస్సార్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.. తాజాగా శనివారం ఆమె హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సమావేశానికి హాజరైన నేతలతో షర్మిల ముచ్చటించారు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆరా తీశారు. స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానంపై అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన ఆక్షాంక్ష అని షర్మిల పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి హైదరాబాద్‌, రంగారెడ్డి నేతలు ఆమెకు వివరించారు. తెలంగాణలో ఇంకా ఆయనకు అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా గత గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతానని షర్మిల ఇదివరకే ప్రకటించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు