‘మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’

18 Jun, 2021 20:31 IST|Sakshi

కేసీఆర్, హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలి

బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి

మల్లన్నసాగర్ నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాలి.

సాక్షి, సిద్ధిపేట: మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన వృద్ధుడు తుటుకూరి మల్లారెడ్డి మనోవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోవడం గమనార్హం.

తన భార్య పేరు మీద ఇల్లు ఉందని.. ఆమె ఇటీవల మరణించడంతో మల్లారెడ్డికి ఇల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడాన్ని ఇందిరాశోభన్ తప్పుబట్టారు. భార్య మృతి చెందితే భర్తకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి ఊరును వదిలి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. నిర్వాసితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలన్నారు.

మల్లన్న సాగర్ కింద భూ సేకరణ జరిగిన అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందలేదని ఆందోళనలు జరుగుతున్న విషయాన్ని ఇందిరా శోభన్ గుర్తు చేశారు. తన ఫాంహౌస్ కోసం, కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేశారని ఆరోపించారు. మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తమ పార్టీ నాయకురాలు షర్మిల అక్క అండగా ఉంటారని, వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. 

చదవండి: నిరుద్యోగంపై వైఎస్‌ షర్మిలకు తొలి విజయం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు