రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి 

4 Oct, 2021 03:24 IST|Sakshi
బీసీ గౌరవసభలో షర్మిలకు గొర్రెను బహూకరిస్తున్న దృశ్యం

పాలకుల స్వార్థం వల్లే బీసీల వెనుకబాటు  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల  

కోస్గి: రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలలో వెనుకబాటుతనానికి పాలకుల స్వార్థ రాజకీయాలే కారణమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ గౌరవ సభకు ఆమె ముఖ్యఅథితిగా హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ జనాభాలో 56 శాతం, రాష్ట్ర జనాభాలో 52 శాతం బీసీలున్నప్పటికీ అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వారి అభ్యున్నతికి చేసిన కృషి శూన్యమేనన్నారు.

జనాభాలో 0.5 శాతం ఉన్న వెలమలు రాజ్యమేలితే సగానికి పైగా ఉన్న బీసీ కులాలు మాత్రం కులవృత్తుల అభివృద్ధి పేరుతో జరుగుతున్న కుట్రలో బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకొని తాతలనాటి తరానికి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. బీసీల కోసం 2018లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2019లో మరో వెయ్యి కోట్లు కేటాయించినా రూ.5 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

బీసీల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ.. చట్టాలు సవరించాలన్నారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తమ్మలి బాల్‌రాజ్, జెట్టి రాజశేఖర్‌ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు