బీజేపీతో పొత్తు లేదు.. వైఎస్‌ షర్మిల

26 Apr, 2022 01:21 IST|Sakshi

భద్రాచలం/బూర్గంపాడు: బీజేపీతో తమ పార్టీకి పొత్తు ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ విష ప్రచారం చేస్తోందని, అలాంటివేమీ ఉండవని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమాన్ని అందించిన వైఎస్సార్‌ కూతురుగా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అలాగే ఏపీలో తన అన్న జగన్‌తో గొడవల వల్లే తెలంగాణలో పార్టీ స్థాపించానని కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ జగనన్నతో తనకు ఎలాంటి గొడవలు లేవని షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌పై తీరుపై ధ్వజమెత్తారు. యాదాద్రి, భద్రాద్రి.. తనకు రెండు కళ్లని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, యాదాద్రిపై తల్లి ప్రేమను, భద్రాద్రిపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే యాదాద్రిని అభివృద్ధి చేశారని, భద్రాద్రిలో వారికి భూములు లేనందున అనాథగా వదిలేశారని పేర్కొన్నారు. చిన్న జబ్బులకే ఢిల్లీకి పరుగెత్తే సీఎం కేసీఆర్‌కు.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గిరిజనులు పడుతున్న అవస్థలు కనిపించవా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు నిర్మించకుండా గోదావరిని కలుషితం చేస్తున్నారని, గంగా ప్రక్షాళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గోదావరి కనిపించటం లేదా అని నిలదీశారు.

అంతకు ముందు బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా చేశామని చెప్పుకుంటున్న పాలకులు.. రైతులు కూలీలుగా ఎందుకు మారుతున్నారో వివరించాలని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గిరిజన రైతుల నుంచి భూములు లాక్కుని మొక్కలు నాటడమేనా రైతును రాజును చేయటమంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు తెలంగాణలో అసలు గుర్తింపు లేకుండా పోయిందని విచారం వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని అన్నారు. బూర్గంపాడు మండలం కొత్తూరులో ప్రారంభమైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇరవెండి, కోయగూడెం, తాళ్లగొమ్మూరు, సారపాక గ్రామాల మీదుగా భద్రాచలం వరకు కొనసాగింది.

మరిన్ని వార్తలు