కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది: వైఎస్‌ షర్మిల

12 Aug, 2021 08:36 IST|Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

కొత్త ఉద్యోగాల్లేవు .. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేదు

తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవాలి 

సాక్షి, హైదరాబాద్‌ /కవాడిగూడ:  నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరైనా సంపాదించుకున్నారూ అంటే.. అది కేవలం కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమేనని ఆరోపించారు. కాళేశ్వరం రీడిజైనింగ్, మిషన్‌ భగీరథ పేరుతో వేల కోట్ల కమీషన్లు తిని, ఫాం హౌస్‌లో దాచిపెట్టుకున్నారని ఆరోపించారు.

ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వడం కాదు కదా ఉన్న ఉద్యోగాలకు భరోసా ఇవ్వని అసమర్థ నాయకుడు కేసీఆర్‌ అని తీవ్రంగా మండిపడ్డారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎంతో సంపాదించారని చెప్పడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద  ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేపట్టిన దీక్షకు షర్మిల సంఘీభావం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం, వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి.  

ఏం తప్పు చేశారని తొలగించారు? 
ఉపాధి పనులు అందరికీ చేరాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించారని షర్మిల గుర్తు చేశారు. కానీ ఏం తప్పు చేశారని కేసీఆర్‌ వారిని తొలగించారని ప్రశ్నంచారు. జీతాలు పెంచాలని అడగడం తప్పా అని నిలదీశారు. ఉద్యోగాలు పోయాయన్న బాధతో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు విడిచారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.  వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ప్రజలు, బాధితుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.  

మాట నిలబెట్టుకున్న షర్మిల 
చనిపోయిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన షర్మిల.. ఆ మేరకు 9  కుటుంబాలకు పార్టీ కార్యాలయంలో రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.  

హుజూరాబాద్‌లో నామినేషన్లు: ఆర్‌.కృష్ణయ్య  
విధుల్లోకి తీసుకోకపోతే హుజూరాబాద్‌ ఎన్నికల్లో 1,500 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జేఏసీ చైర్మన్‌ ముదిగొండ శ్యామలయ్య, సీఐటీయూ నాయకులు వెంకట్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.  

 చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి..

మరిన్ని వార్తలు