వరంగల్‌ ఇంకా వెనకబడే ఉంది : వైఎస్‌ షర్మిల

11 Mar, 2021 09:49 IST|Sakshi
జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్‌ షర్మిల

విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ సాధ్యమైంది

వరంగల్‌ జిల్లా నేతలు, కార్యకర్తల ఆత్మీయసమ్మేళనంలో వైఎస్‌ షర్మిల  

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో మంది ఉద్యమకారులను, మరెంతో మంది కళాకారులు అందించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇంకా వెనకబడే ఉందని దివంగత సీఎం వైఎస్సార్‌ తనయ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్, ఒక్కపాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అందెశ్రీ, కాళోజీ నారాయణరావు, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు, రాణిరుద్రమ లాంటి ధీరులు పుట్టిన నేల ఓరుగల్లు అని కొనియాడారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వైఎస్సార్, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ షర్మిల ప్రసంగించారు.

విద్యార్థులు ముందు ఉండి ఉద్యమం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందని, విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన పాలకులు వాళ్లను మరిచిపోయారన్నారు. హక్కుల కోసం విద్యార్థులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. నేటికి సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు ది మిలియన్‌ మార్చ్‌.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. శ్రీరాంసాగర్‌ స్టేజ్‌–2 పనులను దివంగత సీఎం వైఎస్సార్‌ పూర్తి చేశారని, దేవాదుల ఫేజ్‌–1, 2లను 80 శాతం పూర్తి చేశారని, ఇంకో 20 శాతం పనులు పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీళ్లందేవని వివరించారు. కాంతన్‌పల్లి ముందుకు వెళ్లకపోవడం బాధాకరమన్నారు. కాకతీయ థర్మల్‌ ప్రాజెక్టు వైఎస్సార్‌ ఆలోచనేనని చెప్పా రు. రాజన్న బతికుంటే వరంగల్‌ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోయేదని వెల్లడించారు.

వరంగల్‌ జిల్లాలో రైతులు, మహిళలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ అయ్యేట్టు ఉందా, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ వస్తోందా.. అని ప్రశ్నించారు. మొన్న వచ్చిన వరదలకు వరంగల్‌ ఏమైందో చూశారు కదా అని అన్నారు. కాకతీయ వర్సిటీలో వీసీ ఉన్నారా?.. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే దాడులు జరపడం బాధాకరమని, అమానుషమన్నారు. జర్నలిస్టులకు కూడా సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లా నేతలు షర్మిల కు తలపాగా పెట్టి, ఖడ్గం బహూకరించారు. వరంగల్‌ జిల్లాపై మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని షర్మిల కోరారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, ఇందిరాశోభన్, వరంగల్‌ జిల్లా నేతలు ఎన్‌ శాంతికుమార్, డాక్టర్‌ చంద్రజా వాడపల్లి, కల్యాణ్‌రాజ్, వెంకటరెడ్డి, అచ్చిరెడ్డి, దేవానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి : (కేసీఆర్‌కు ఓటమి భయం.. అందుకే ఫిట్‌మెంట్‌ లీక్‌)
(లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు