కేసీఆర్‌ పాలన మహిళలకు ల్యాండ్‌మైన్‌ 

9 Mar, 2023 01:58 IST|Sakshi

బయటకు అడుగుపెడితే ఏం జరుగుతుందోనని మహిళల్లో ఆందోళన 

మహిళా కమిషన్‌ ఒక డమ్మీ వ్యవస్థ.. గవర్నర్‌కే గౌరవం లేదు 

ట్యాంక్‌బండ్‌పై ధర్నా కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల ధ్వజం 

అనుమతి లేదంటూ అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారయ్యిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఎక్కడ బయటకు అడుగేస్తే ఎవరు వేధిస్తారోననే భయం మహిళల్లో నెలకొందన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రక్షణ కరువైందని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై నల్లబ్యాడ్జీలతో షర్మిల మౌనదీక్ష చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు సంబంధించి వేల కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా ఘటనలకు పాల్పడిన వారిలో ఎక్కువగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఉన్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను మహిళా ద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్‌ డమ్మీగా మారిందని, ఒక మహిళా గవర్నర్‌కు కనీస గౌరవం సైతం లభించడం లేదని ఆక్షేపించారు.

కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత, చైతన్యారెడ్డి, కల్పనాగాయత్రీ, ఝాన్సీరెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కోఆర్డినేటర్‌ వాడుక రాజ్‌గోపాల్, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. కాగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. కాగా, దీక్షకు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిలింనగర్‌లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. 

షర్మిల ‘బస్తీబాట’ వాయిదా:.. 
వైఎస్‌ షర్మిల తలపెట్టిన గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్తీ బాటపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్‌ ఆరోపించారు. గురువారం చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బస్తీబాట వాయిదా పడిందన్నారు. 

మరిన్ని వార్తలు