ప్రతి కుటుంబానికి మన జెండా చేరాలి: వైఎస్‌ షర్మిల

5 Aug, 2021 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఎజెండా అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు వైఎస్సార్‌ ప్రారంభించినవేనని తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంక్షేమానికి చెరగని సంతకం వైఎస్సార్‌. వైఎస్సార్‌ సంక్షేమ పాలన నుంచే పార్టీ జెండా పుట్టుకొచ్చింది. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుంది. అలాగే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే సంతోషం కలుగుతుంది. పార్టీ జెండాను చూస్తే రెట్టింపు సంతోషం కలగాలనే ఉద్దేశంతోనే పాలపిట్ట రంగును ప్రవేశపెట్టాం.

ఇక నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుంది. సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్ నినాదమే పార్టీ సిద్ధాంతం. పాలనలో అందరికీ భాగస్వామ్యం, అన్ని వర్గాలకు సమన్వాయం చేయడమే నీలి రంగు ఉద్దేశం. గ్రామగ్రామాన వైఎస్సార్‌ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పాలి. మహానేత వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రతి ఒక్క వర్గానికి చేర్చారు. వైఎస్సార్‌ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి మన జెండా చేరాలి. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5వరకు నిర్వహిస్తున్న ఈ జెండా పండుగను ఊరూరా, గ్రామగ్రామాన నిర్వహించాలి. తెలంగాణలో 35ఏండ్లు పైబడిన వారందరికీ మహానేత చేసిన సంక్షేమ పాలన తెలుసు. 35 ఏండ్లు లోపల ఉన్నవాళ్లకి ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలిసినా సంక్షేమ పాలన కళ్లారా చూసి ఉండరు.

కనుక 35 ఏండ్లు లోపు ఉన్నవారికి వైఎస్సార్‌ సంక్షేమ పాలన ఎలా ఉందో చెప్పాలి. ప్రజలకు వైఎస్సార్‌ పాలన గుర్తు చేయాలి. వారికి అందిన సంక్షేమ ఫలాలు గుర్తు చేయాలి. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండని, మద్దతు ఇవ్వండని కోరాలి.  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం గురించి ప్రజలకు వివరించాలి. చేయి చేయి కలిపితే రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురాగలం. మనం పార్టీ పెట్టకముందే ప్రజల మధ్య ఉండి పోరాటం చేశాం. ఏ ప్రతిపక్షం చేయని విధంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం. మనం పోరాటం మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి భయం వచ్చింది. ప్రతిపక్షానికి సోయి వచ్చింది. పార్టీ లేకున్నా వైఎస్సార్‌ అభిమానులంతా నా పక్కన నిలబడ్డారు. అందుకు మీరందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు