జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఏకపక్షమే..

19 Nov, 2021 02:39 IST|Sakshi
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొమ్మరాజుపల్లిలో ‘వైఎస్సార్‌సీపీ’ సంబరాలు

ఆధిక్యత చాటుకున్న వైఎస్సార్‌సీపీ

ఓట్ల లెక్కింపు జరిగిన 11 జెడ్పీటీసీల్లో 8 చోట్ల గెలుపు

ఎంపీటీసీల్లో 85 చోట్ల విజయభేరి.. ఏకగ్రీవాలతో కలిపితే 131

ఏకగ్రీవంగా గెలిచిన నాలుగు జెడ్పీటీసీలతో కలిపితే 12 అధికార పార్టీవే

మూడు జెడ్పీటీసీలు, 33 ఎంపీటీసీల్లో టీడీపీ గెలుపు  

సాక్షి, అమరావతి:  గత రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్‌సీపీ తన ఆధిక్యతను చాటుకుంది. జమ్మలమడుగుతో సహా 11 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఫలితాలను ప్రకటించగా 8 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయభేరీ మోగించింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది. 129 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించగా 85 వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 33 చోట్ల టీడీపీ నెగ్గింది. ఐదు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ, సీపీఎం రెండు చోట్ల, సీపీఐ ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. 

ఏకగ్రీవాలతో కలిపి 12 జెడ్పీటీసీలు..
మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఒకటవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. వీటికి తోడు సెప్టెంబరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్లు తడిచిపోవడంతో లెక్కించేందుకు వీలు కాక ఫలితాల ప్రకటన నిలిపివేసిన జమ్మలమడుగు జెడ్పీటీసీ, మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని బూత్‌లకు కూడా తాజాగా ఎన్నికలు జరిగాయి.

మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాగా నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసిన విషయం తెలిసిందే. ఏకగ్రీవమైన నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్‌సీపీ దక్కించుకోగా ఎంపీటీసీ స్థానాల్లో 46 వైఎస్సార్‌సీపీ, మూడు టీడీపీ, ఒక చోట స్వతంత్రులు గెలిచారు. ఈ నేపథ్యంలో మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 12 వైఎస్సార్‌సీపీకి దక్కగా 179 ఎంపీటీసీ స్థానాల్లో 131 అధికార పార్టీ విజయం సాధించింది.

+

మరిన్ని వార్తలు