Andhra Pradesh: అధికార పార్టీ అరుదైన రికార్డు

19 Nov, 2021 02:59 IST|Sakshi

వంద శాతం మేయర్‌ పీఠాలతో సరికొత్త చరిత్ర

రెండో దశలో వైఎస్సార్‌సీపీకి 55.77% ఓట్లు 

టీడీపీ గెలిచిన దర్శిలోనూ ఓట్ల షేర్‌లో ఫ్యాన్‌దే ఆధిక్యం

కొండపల్లిలోనూ ఓట్ల షేర్‌లో అధికార పార్టీనే టాప్‌ 

సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్‌ పీఠాలను వందకు వంద శాతం, పురపాలక, నగర పంచాయతీల్లో 96.55 శాతం స్థానాలను సొంతం చేసుకోవడం ద్వారా వైఎస్సార్‌ సీపీ దేశంలో అరుదైన రికార్డును నెలకొల్పింది. తొలివిడత ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ అధికార పార్టీ కైవశం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగుర వేయడం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ కేవలం దర్శి, తాడిపత్రి మునిసిపాలిటీలకే పరిమితమైంది. కొండపల్లి మునిసిపాలిటీలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు సమంగా వార్డులు దక్కడంతో ‘టై’ అయింది. టీడీపీ గెలిచిన దర్శి, టై అయిన కొండపల్లిలో ఓటు షేర్‌ పరిశీలిస్తే వైఎస్సార్‌ సీపీకే ఎక్కువగా ఉండటం గమనార్హం.

దర్శిలో వైఎస్సార్‌ సీపీ ఓటు షేర్‌ 48.30 శాతం కాగా టీడీపీ ఓటు షేర్‌ 46.57గా ఉంది. కొండపల్లిలో వైఎస్సార్‌ సీపీ 47 శాతం, టీడీపీ 44.17 శాతం ఓటు షేర్‌ను సాధించాయి. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్‌ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులే నెగ్గారు.

స్పష్టమైన ఆధిక్యంతో..
తాజాగా రెండో దశలో నెల్లూరు కార్పొరేషన్, 12 మునిసిపాలిటీల్లో 328 డివిజన్‌లు, వార్డులతోపాటు పలు మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 25 డివిజన్‌లు, వార్డులకు సంబంధించి ఎన్నికల్లో పోలైన మొత్తం 5,17,430 ఓట్లలో వైఎస్సార్‌ సీపీ ఏకంగా 2,88,568 ఓట్లు (55.77 శాతం) దక్కించుకుంది. మొదటి దశ ఎన్నికల్లో 48,76,933 ఓట్లు పోల్‌ కాగా వైఎస్సార్‌ సీపీ 52.75 శాతంతో 25,72,595 ఓట్లను సాధించింది. అంటే మొదటి దశతో పోలిస్తే రెండో దశలో అధికార పార్టీకి ఓట్లు మూడు శాతానికిపైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ 1,76,954 ఓట్లకే (34.20 శాతం) పరిమితమైంది. జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 51,908 ఓట్లు (10.03 శాతం) దక్కాయి. 

రాజంపేటలో అత్యధికంగా..
నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీకి 58.07 శాతం ఓట్లు రాగా టీడీపీకి 28.37% వచ్చాయి. రాజంపేట మునిసిపాలిటీలో వైఎస్సార్‌సీపీకి అత్యధికంగా 63.54% ఓట్లు లభించాయి. మొత్తం 353 వార్డులు, డివిజన్‌లకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ 261 (73.91%) వార్డులు డివిజన్లను దక్కించుకుంది. టీడీపీ 82 (23.22%) వార్డులు, డివిజన్లకు పరిమితమైంది. 

81.85 శాతం వార్డులు, డివిజన్లు వైఎస్సార్‌సీపీవే
రాష్ట్రంలో రెండు దశల్లో 13 కార్పొరేషన్లు, 87 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3,125 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 81.85 అంటే 2,558 వార్డులు, డివిజన్లను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. టీడీపీ కేవలం 13.76 శాతం అంటే 430 వార్డులు, డివిజన్లలో నెగ్గింది. బీజేపీ/జనసేన 1.24 శాతంతో 39 వార్డులు, డివిజన్లు సాధించగా ఇతరులు 98 (3.13 శాతం) వార్డులు, డివిజన్లను దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు