మండపేటలో టీడీపీ పాతికేళ్ల ఆధిపత్యానికి గండి

15 Mar, 2021 04:08 IST|Sakshi

‘దేశం’ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

30 వార్డులకు 22 వార్డులు కైవసం.. 7 వార్డులకే టీడీపీ పరిమితం  

మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా పేరుపొందిన మండపేటలో ఆ పార్టీ ఆధిపత్యానికి గండి పడింది. మున్సిపల్‌ ఎన్నికల్లో మండపేట పురపాలక సంఘం వైఎస్సార్‌సీపీ పరమైంది. మొత్తం 30 వార్డులకుగాను 22 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఏడు వార్డులకు పరిమితమైంది. దాదాపు 25 ఏళ్లుగా మండపేట మున్సిపాలిటీలో టీడీపీదే ఆధిపత్యం. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జునచౌదరి సతీమణి విజయ ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1995, 2000, 2005, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించగా అందులో సగంపైగా మండపేట పట్టణం నుంచే వచ్చింది. అయితే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం.. సీఎం వైఎస్‌ జగన్‌ సాగిస్తున్న సంక్షేమ పాలనతో టీడీపీ కంచుకోట అని భావించిన మండపేటలో ఆ పార్టీ కూసాలు కదిలిపోయాయి. వైఎస్సార్‌సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు తన రాజకీయ వ్యూహాలతో పార్టీకి ఘనవిజయం అందించారు.  

కార్పొరేషన్లలో సైకిల్‌ అడ్రస్‌ గల్లంతు 
11 కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. తమకు పట్టున్నట్లు చెప్పుకుంటూ కచ్చితంగా గెలుస్తామని బీరాలు పలికిన విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో సైతం చిత్తుగా ఓడిపోయింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు కార్పొరేషన్‌లో ఆ పార్టీకి వచ్చిన డివిజన్లు 8 మాత్రమే కావడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో ఆ పార్టీ ప్రభావమే కనిపించలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టి గెలవాలని చంద్రబాబు చూసినా నగర ప్రజలు ఛీకొట్టారు. విశాఖలో గత ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచినా కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం కనపడలేదు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ చతికిలపడింది. ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఉన్నా మున్సిపాల్టీలో గెలవలేకపోయింది.  

మరిన్ని వార్తలు