రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ

2 Feb, 2021 04:08 IST|Sakshi
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో పార్టీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. బడ్జెట్‌ చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, బాలశౌరి, రెడ్డెప్ప, నందిగం సురేష్, కృష్ణదేవరాయలు, తలారి రంగయ్య, బి.సత్యవతి, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, వంగా గీత, ఎంవీవీ సత్యనారాయణ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘త్వరలో ఎన్నికల జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేలా బడ్జెట్‌ ఉంది. విజయవాడ, విశాఖ మెట్రోల గురించి పట్టించుకోలేదు.

పోలవరం విషయంలోనూ అంతే. ఖరగ్‌పూర్‌–విజయవాడ, ఇటార్సి–విజయవాడ కారిడార్‌లవల్ల ఏపీకి ఉపయోగం ఉండదు. హోదాపై నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదని తెలుస్తోంది. వైరాలజీ కేంద్రాల్లో ఒకటి ఏపీకి కేటాయించాలని, కొత్త టైక్స్‌టైల్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని, అరకు–విశాఖ విస్టాడోమ్‌ కోచ్‌లు మరిన్ని ఇవ్వాలని డిమాండు చేస్తున్నాం. త్వరలో సీఎం జగన్‌ 26 జిల్లాలు ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లాకొక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీ సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన రూ.4,282 కోట్లు వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తే కేంద్రం బడ్జెట్‌లో విశాఖపట్నం ఒక్కటే ప్రస్తావించింది. ’ అని విజయసాయిరెడ్డి అన్నారు.  వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా గత ఏడాది రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చినట్లే ఈ ఏడాది కూడా తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం’ అని మిథున్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు