అయ్యన్న అరెస్ట్‌కు డిమాండ్‌

19 Sep, 2021 05:10 IST|Sakshi
ఎస్పీ విశాల్‌ గున్నికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌ తదితరులు

గుంటూరు రూరల్‌ ఎస్పీని కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ 

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులపై అభ్యంతరకరమైన భాషలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, జీడీసీసీ చైర్మన్‌ రాము, జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా బత్తుల దేవా, వైఎస్సార్‌సీపీ నాయకుడు షౌకత్‌ తదితరులు శనివారం కలిశారు. అయ్యన్నపై ఫిర్యాదు చేసిన వారంతా ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై, పోలీస్‌ శాఖపై, రాజ్యాంగ బద్ధమైన హక్కులపై అయ్యన్నపాత్రుడు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని ధ్వజమెత్తారు.

హోంమంత్రిగా ఉన్న దళిత మహిళను కించపరిచేలా, చట్టాలను అపహాస్యం చేసేలా వ్యవహరించిన అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రణాళిక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను బలహీనపరిచేలా ఉందని, వారు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ ప్రజారంజకమైన పాలనతో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. జగన్‌ అందిస్తున్న చక్కని పరిపాలనతో చంద్రబాబు కూశాలు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడి బతుకు ఏమిటో ఏ చెట్టు, పుట్టనడిగినా చెబుతాయని ఎద్దేవా చేశారు.

అయ్యన్నపై కేసు నమోదు
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నకరికల్లు మండలం కండ్లకుంట మాజీ సర్పంచ్‌ కంఠమనేని కోటేశ్వరరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 16న కండ్లకుంటలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీ 153ఏ, 505, 504, 501 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు నకరికల్లు ఎస్‌ఐ ఉదయ్‌బాబు తెలిపారు.  

మరిన్ని వార్తలు