-

దళితులపై దాడిలో బాబు హస్తం!

1 Aug, 2021 03:15 IST|Sakshi

దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్న చంద్రబాబుకు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని బాబు గ్రహించాలన్నారు. అసలు దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర ఉందని.. పోలీసులు ఆయనపైనా కేసు పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు. దళితులపై దాడిచేసిన ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం అత్యంత దుర్మార్గమన్నారు. టీడీపీ అధినేత బుద్ధి కొంచెం కూడా మారలేదని.. అగ్రవర్ణ అహంకారం కొంచెం కూడా తగ్గలేదని వారు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రి పేర్ని నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు.  
 –సాక్షి, అమరావతి 

ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించినందుకే.. 
దేవినేని ఉమా ఇంట్లో పడుకుంటేనో లేక మీ సంచులు మోస్తుంటేనో కేసులు పెట్టలేదని.. దళితులపై దాడిచేసి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని బాబు గ్రహించాలని పేర్ని నాని తెలిపారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమాలు కొండలను పిండిచేసి తినేసిన విషయాన్ని శాటిలైట్‌ మ్యాప్‌లే చెబుతున్నాయన్నారు. ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరు అని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశాడని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమన్నారు. 2019 నుంచి చెప్పిన ప్రతి మాటను నిజం చేస్తూ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ ఇంజినీరింగ్‌ అనే పదానికి ఆంధ్రప్రదేశ్‌లో అర్థం చూపించిన వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు. ఖాకీ యూనిఫామ్‌ నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం జగన్‌ ప్రభుత్వంలోనేనని పేర్ని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును అడ్డుపెట్టుకుని పోలీసుల్ని వాడుకున్నది చంద్రబాబేనని తెలిపారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద రాజకీయాలు చేసే అవకాశంలేక, ఇవాళ దేవినేని ఉమా లాంటి వాళ్లను అడ్డంపెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

టీడీపీ కమిటీతో మేమూ వస్తాం.. సిద్ధమా?
గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే చంద్రబాబు వచ్చారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆరోపించారు. పరామర్శ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విరుచుకుపడ్డారు. మైనింగ్‌పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా? అని సవాల్‌ చేశారు. మైనింగ్‌లో ఎవరు దోచుకున్నారో మొత్తం తేలుస్తామని.. ఉమా బండారం బయట పెడతామన్నారు. ఒక దళితుడిని కులం పేరుతో దేవినేని ఉమా దూషిస్తే చంద్రబాబు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని పరామర్శించేందుకు వెళ్లటమే పెద్ద తప్పని, దానిని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన తెలిపితే అది రౌడీయిజం అంటారా అని జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం నిరసన తెలిపే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఉమా, టీడీపీ ఇతర నేతలు మైలవరంలో మైనింగ్‌తో పాటు అన్నింటినీ లూటీ చేశారన్నారు.  

దళితులపై బాబు పగబట్టారు 
ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. దళితులపై దాడిచేసిన దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇక ఎప్పటికీ చంద్రబాబును నమ్మరని చెప్పారు. మైనింగ్‌ జరిగిన కొండపల్లి అడవిలో ఏం జరిగిందో చంద్రబాబుకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి సీఎం జగన్‌పై దేవినేని ఉమా చేస్తున్న దుష్ప్రచారాలకు ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని తెలిపారు. 

చంద్రబాబుపై కేసు పెట్టాలి
దళితులపై దాడిచేసిన దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారని.. ఆ దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితులపై స్వారీ చేయాలనుకోవడం దారుణమన్నారు. పోలీసులు చంద్రబాబుపై ఏ–2 కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పటివరకూ ఈ అంశంపై క్షమాపణ చెప్పలేదని.. పైగా పశ్చాత్తాపం కూడా పడలేదని మేరుగ గుర్తుచేశారు. దళితుల పేర్లు చెప్పుకుని బాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని.. ఉమా అబద్ధాలను నిజం చేసేందుకు  తాపత్రయపడుతున్నారని తెలిపారు. బాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాగార్జున హితవు పలికారు. అంబేడ్కరిజానికి తూట్లు పొడుస్తున్న ఆయన రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడన్నారు. 

మరిన్ని వార్తలు