పేదల ఇళ్లకు కంకర రాకుండా టీడీపీ కుట్ర

29 Jul, 2021 04:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అక్రమ మైనింగ్‌కు పాల్పడి దోచుకున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఇప్పుడు మందిని వెంటేసుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాడని మంత్రి, ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేత కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్లు ఎల్లోమీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014–19 మధ్య జరిగిన మైనింగ్‌కు సంబంధించిన గూగుల్‌ చిత్రాలను మంత్రి విడుదల చేశారు. 

దాడి జరిగింది మాపైనే..
గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు బుద్ధిరాలేదు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఉమా మీద ఎవరూ దాడి చేయలేదు. ఉమాయే 100 మందిని వెంటబెట్టుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం క్రియేట్‌ చేశారు. చివరికి తనపై దాడి జరిగిందని డ్రామా నడిపించారు. ఎల్లో మీడియాలో గగ్గోలు పెట్టారు. వాస్తవంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు దుర్గాప్రసాద్‌ కారుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. దళిత యువకుడు సురేష్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు జరిగిన దాన్ని మసిపూసి మారేడు కాయచేస్తూ మాట్లాడారు. కొండపల్లి ప్రాంతంలో 1978 నుంచి మైనింగ్‌ జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఎన్నడూ లేనంతగా అక్రమ మైనింగ్‌ జరిగింది. ఉమా మైలవరం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో 70 శాతం మేరకు మైనింగ్‌ జరిగినట్లు మ్యాప్‌ల్లో కనిపిస్తోంది. అధికారం పోగానే కొత్తరాగం అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణాలకు కంకర దొరకకూడదు, నిర్మాణాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు.
– వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే

అరాచకం సృష్టించేందుకే వెళ్లిన ఉమా 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణానికి కంకర దొరక్కుండా ఆగిపోవాలని తెలుగుదేశం పార్టీ కుట్రచేస్తోంది. ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైనింగ్‌ పేరుతో చేస్తున్న హైడ్రామా అసలు ఉద్దేశం ఇదే. గడ్డమణుగు గ్రామంలో మంగళవారం దళితులు, ప్రజలను దుర్భాషలాడిన దేవినేని తనపైనే దాడిచేశారని బొంకడం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ నాయకుడి కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్టు ఎల్లో మీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడు. అరాచకం సృష్టించేందుకే మైనింగ్‌ ప్రాంతం సందర్శన పేరుతో వెళ్లిన ఉమా అక్కడ మా పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దళితులు, పోలీసులను దుర్భాషలాడాడు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 1978 నుంచే మైనింగ్‌ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దేవినేని ఉమా ఎమ్మెల్యే, మంత్రి అయ్యాకే  70 శాతం మైనింగ్‌ జరిగినట్లు గూగుల్‌ పటాల ద్వారా తెలుస్తోంది. అక్కడి కాంట్రాక్టర్లను, క్రషర్స్‌ యజమానులను బెదిరించి, కమీషన్ల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఇవ్వకపోతే అది ఫారెస్ట్‌ ల్యాండ్‌ అంటూ రాయించి 2018లో పనులు ఆపించాడు. డబ్బులు దండుకున్నాక రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తితో అది రెవెన్యూ భూమేనని, మైనింగ్‌ చేసుకోవచ్చని స్టే ఇప్పించాడు. ఓడిపోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మైనింగ్‌ చేస్తున్నాడంటూ బురద చల్లుతున్నాడు. వాస్తవాలేంటో తేల్చమని పోలీసులను కోరుతున్నాం.

రైతు కష్టం తెలిసిన వ్యక్తి జగన్‌
రైతులకు పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లు బకాయి పడిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. సీఎం జగన్‌ తాను చెప్పినట్టే రూ.1,600 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. కేంద్రం నుంచి రూ.2,800 కోట్లు వచ్చాయి. పూర్తిగా కట్టాల్సిన డబ్బుల్లో రూ.3,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. మిగిలినవి త్వరలోనే విడుదల చేస్తాం. రైతన్న కష్టం తెలిసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడు. ఇంకో ఏడాదిలో ఇది జరుగుతుంది. చంద్రబాబు సింగపూర్‌కో, మలేసియాకో వెళ్తాడు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగస్వామ్యం కావద్దని ఆ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాం.       
 – కొడాలి నాని, మంత్రి

రాత్రిపూట పరిశీలనకు వెళ్లారా?
రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఛీకొట్టి ఓడించినా బుద్ధి మారలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ చేతితో ఓటమిని జీర్ణించుకోలేక దేవినేని ఉమా కుట్ర చేస్తున్నారు. మైనింగ్‌ అక్రమాలు జరిగితే ఉమా అధికారుల దృష్టికి తీసుకురాకుండా అనుచరులతో కలిసి రాత్రిపూట పరిశీలనకు ఎందుకు వెళ్లారు? అక్రమాలు జరిగితే రాత్రులు పరిశీలనకు వెళ్లటంపై ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ నేతలపై ఉమా దాడిచేశారు. ఏదో రకంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై బురదజల్లే ప్రయత్నం చేయటం హేయం. చిల్లరతత్వంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమా ఇకనైనా ఇలాంటి డ్రామాలు ఆపాలి. పదేపదే అసత్యాలు చెబుతూ గోబెల్స్‌ ప్రచారం చేయటం అలవాటైన ఆయనకు నిజాలు రుచించవు. మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు వాస్తవాలు వెల్లడించినా ఉమా డ్రామాలాడటం విడ్డూరంగా ఉంది.  
 – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే

అన్నీ దోచుకుతిన్నది ఉమానే 
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు సొల్లు మాటలు మాట్లాడటం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు కూడా మిగలవు. డ్రామా ఆర్టిస్టు దేవినేని సొల్లు ఉమా నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెరతీశాడు. చంద్రబాబు అండ్‌ కో ఇలాగే ప్రవర్తిస్తుంటే గ్రామాల నుంచే కాదు.. రాష్ట్రం నుంచే తరిమితరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో గనులు, ఇసుక, మట్టి దగ్గర నుంచి ఆఖరికి బూడిద వరకు మొత్తం దోచుకుతిన్నది దేవినేని ఉమానే. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి దోచుకున్నారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గ్రావెల్‌ తవ్వించింది, అమ్ముకున్నది కూడా దేవినేని, టీడీపీ నేతలే. ఇసుక దోచుకున్నది వారే. అధికారంలో ఉన్న ఐదేళ్లు దోచుకుని, దాచుకుని, మళ్లీ మా ప్రభుత్వంపై నిందలు వేస్తారా?  మాది స్వచ్ఛమైన పారదర్శక ప్రభుత్వం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ వారు తప్పుచేసినా వదిలిపెట్టారు.

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
దేవినేని ఉమా, ఆయన అనుచరులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను తిడితే ఊరుకుంటారా?ఉమాపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసి, శిక్ష విధించాలి. అసలు అక్రమ క్వారీయింగ్‌ జరగటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాల మెరక కోసం తెచ్చుకుంటున్నామని చెప్పి ప్రజలు అడ్డగిస్తే నెపం వైఎస్సార్‌సీపీపై వేస్తారా? కారు అద్దాలు పగలగొట్టుకుని, కారులో కూర్చొని, తనపై దాడి జరిగిందని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు.
– జోగి రమేశ్, ఎమ్మెల్యే 

మరిన్ని వార్తలు