బీజేపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే..

29 Jul, 2021 04:31 IST|Sakshi

టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు విషయంలో రాద్ధాంతంపై ఎమ్మెల్యే విష్ణు ఆగ్రహం 

మతాల మధ్య చిచ్చుపెట్టేలా దిగజారుడు రాజకీయాలంటూ మండిపాటు

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ 

సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు తదితర సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే టిప్పు సుల్తాన్‌ విగ్రహంపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సమస్యలూలేనట్టుగా బీజేపీ నేతలు ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేని బీజేపీ.. తన ఉనికిని కాపాడుకునేందుకు రోజుకో డ్రామాకు తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు తమకు నచ్చిన స్వాతంత్య్ర సమరయోధులు, నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని, కానీ మతాల మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్‌ విసిరారు..

► కర్ణాటకలో మీ యడ్యూరప్ప టిప్పు సుల్తాన్‌ వేషధారణను అనుకరించలేదా? ఆయన మాదిరిగానే టోపీ ధరించి.. కత్తిని చేతబట్టి కార్యక్రమానికి హాజరుకాలేదా?   
► దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. అక్టోబర్‌ 25, 2017న బెంగుళూరులో విధాన సౌథ డైమండ్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా శాసనసభ ఉమ్మడి సమావేశంలో టిప్పు సుల్తాన్‌పై పొగడ్తల వర్షం కురిపించలేదా? బ్రిటిష్‌ వారితో పోరాడి టిప్పు సుల్తాన్‌ వీరోచిత మరణం పొందారని కీర్తించలేదా? రాష్ట్రపతి మాట్లాడింది తప్పు అయితే.. ఇప్పటివరకు రాష్ట్రపతి కార్యాలయం ఎందుకు ఖండించలేదు?  
► టిప్పు సుల్తాన్‌ కీర్తిని ప్రపంచం మొత్తం చాటిచెప్పేలా ఆయన శకటాన్ని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ఏ ప్రభుత్వం ప్రదర్శించింది? 
► జులై 15, 1974లోనే టిప్పు సుల్తాన్‌ పేర్న స్టాంప్‌లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేయలేదా?    

మరిన్ని వార్తలు