టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి

29 Oct, 2021 04:50 IST|Sakshi
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఆ పార్టీ నేతలు అనాగరిక భాష వాడుతున్నారు

చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషన్‌ సభ్యులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం మెమోరాండం సమర్పించింది. అనంతరం ఎంపీలు మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్, రెడ్డెప్ప, తలారి రంగయ్య, సంజీవ్‌కుమార్, బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవిలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు నారా లోకేష్, దేవినేని ఉమా, బోండా ఉమా, అయ్యన్నపాత్రుడు, పట్టాభి తదితరులు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ఎన్నికల కమిషన్‌ సభ్యులకు వివరించామని తెలిపారు.

టీడీపీ నేతలు అసభ్యకరమైన పదజాలంతో.. రాజ్యాంగబద్ధంగా, ప్రజల ద్వారా ఎన్నికైన రాజ్యాంగ వ్యవస్థను తిట్టడం శోచనీయమన్నారు. వారి వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమిషన్‌ సభ్యులు ఆశ్చర్యపోయారని తెలిపారు. నాగరిక సమాజంలో అనాగరికంగా ‘బోసిడీకే’ అనే అసభ్య పదంతో ముఖ్యమంత్రిని తిట్టారని, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, బోండా ఉమా, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు తదితరులు ముఖ్యమంత్రిని, పోలీసు అధికారులను, ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారని, వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 

ఇలాంటి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలైతే..
టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా తయారైందని, ఏపీలో టెర్రరిస్టు అవుట్‌ ఫిట్‌గా చిత్రీకరించొచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష, అసాంఘిక చర్యలు వివరించి, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ఇలాంటి పార్టీని ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించడం ద్వారా దొంగలు, టెర్రరిస్టులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలైతే దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.

రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో టీడీపీ దొంగలు, టెర్రరిస్టులకు స్థానం ఉండరాదన్న విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు వివరించామని తెలిపారు. తమ మెమోరాండం పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సభ్యులు టీడీపీ నేతలపై కేసులు పెట్టారా.. అని ఆరా తీశారని, అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలు పంపించాలని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీగా ఉన్న 14 స్థానాలు (స్థానిక సంస్థలు–11, ఎమ్మెల్యే–3) భర్తీ చేయాలని కోరామన్నారు. తమ వినతులపై ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు