తప్పు చేయకుంటే భయమెందుకు?

23 Sep, 2020 04:20 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు చంద్రశేఖర్, బ్రహ్మానందరెడ్డి, రంగయ్య, మాధవ్‌

టీడీపీ తీరుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీల మండిపాటు

సాక్షి, న్యూడిల్లీ: అమరావతిలో భూముల అక్రమాలపై ఆధారాలుంటే కేసులు పెట్టాలని సవాల్‌ చేసిన టీడీపీ నేతలు దర్యాప్తుపై స్టే ఎందుకు తెచ్చుకున్నారని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు సూటిగా ప్రశ్నించారు. ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్‌ మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో మాట్లాడారు. 

దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది: బెల్లాన
► సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే దానిపై స్టే తెచ్చారు. విపక్ష పార్టీల నేతలు గుడులు, గోపురాలపై దాడులు చేస్తూ దొంగే దొంగ అని అరిచిన మాదిరిగా వ్యవహరిస్తున్నారు. 

సవాల్‌ చేసి పరార్‌.. రంగయ్య..: భూ కుంభకోణాలు, ఇతర స్కాములపై ఆధారాలు చూపి కేసులు పెట్టుకోవాలని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేతలు మాటపై నిలబడకుండా పారిపోతున్నారు.తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కోర్టులకు వెళ్లి స్టే ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకుంటున్నారు?

తప్పు చేయకుంటే స్వాగతించండి: బ్రహ్మానందరెడ్డి
► అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటున్నారు.
► అమరావతిలో చంద్రబాబు భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పు చేయకుంటే సీబీఐ దర్యాప్తును ఎందుకు స్వాగతించడం లేదు? ఆలయాలపై పారదర్శకంగా వ్యవహరిస్తూ సీబీఐ దర్యాప్తు కోరితే స్వాగతించకుండా విమర్శలకు దిగడం సిగ్గుచేటు. 

మరిన్ని వార్తలు