నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..

25 Dec, 2020 16:35 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పేదవాడి కల నేడు సాకామైందని, తమకూ ఇల్లు ఉంది అన్న భరోసాతో తలెత్తుకొని తిరిగే పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా ఇల్లు కట్టిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రజారంజక పాలన అందించటంలో ఆయన తన తండ్రిని మించి పోయారని, రాష్ట్రంలో పదిహేడు వేల కొత్త ఊళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం గాజులపేటలో పేదల ఇంటి స్థలాల లే అవుట్ వద్ద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..  ‘‘6800 కోట్లు విద్యుత్, నీటి సరఫరాకే కేటాయించారు. శత్రువైనా పేదవాడైతే లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అటువంటి వ్యక్తి కొలువులో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా. పేదలు వస్తే తమ కుల ప్రాబల్యం తగ్గుతుందనే అమరావతిలో ఇంటి పట్టాలను కోర్టుకెళ్ళి టీడీపీ అడ్డుకుంది. మైలవరంలోని పాత్రికేయులందరికీ కూడా సొంతింటి కల సాకారం చేస్తాం’’ అని తెలిపారు.(చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌)

నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఎమ్మెల్యే
గత ప్రభుత్వం నివాసయోగ్యం కాని చోట పట్టాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి బాటలు పడ్డాయని, నేడు అవినీతి, రెకమండేషన్‌, పార్టీలతో పని లేకుండా అర్హులందరికీ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ నేతలకు ఇవేమీ కనిపించడం లేదని, కుల పత్రికను అడ్డుపెట్టుకుని ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘ఎన్నికల్లో ఓటు కోసం మైలవరం ప్రజలను మాజీ మంత్రి దేవినేని ఉమా మోసం చేశాడు. ఇంటి స్థలాలకోసం వెళ్లిన మహిళలపై  టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు . ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేక రాష్ట్ర అభివృద్ధికి ,సంక్షేమానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు’’ అని టీడీపీ నాయకుల తీరును ఎండగట్టారు. ఇక కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో 3,02,420 మందికి ఇంటిపట్టాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.  ‘‘ఇంతమందికి ఒకేసారి పట్టాలు ఇవ్వటం చారిత్రక ఘట్టం. 29696 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. తొలి విడతలో 1 .67 లక్షల ఇళ్లనిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు