టీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలే

14 Nov, 2021 03:38 IST|Sakshi
రైతు వేదన దీక్షలో నినదిస్తున్న వైఎస్‌ షర్మిల 

ధాన్యం కొనుగోలు అంశంపై ఒకరిపై ఒకరు నెపం 

పాలకులే రాష్ట్రంలో ధర్నాలు చేయడం ఇక్కడే చూస్తున్నాం 

ఆంక్షలు పెట్టినప్పుడు ఢిల్లీలో కదా ధర్నాలు చేయాల్సింది 

రైతు వేదన దీక్షలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన వైఎస్‌ షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌/కవాడిగూడ: వరి రైతుల విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలేనని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు.. దొంగ నువ్వు అంటే నువ్వే అన్నట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏజెంట్‌గా మారారని విమర్శించారు.

యాసంగి ధాన్యం కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో షర్మిల శనివారం ధర్నా చౌక్‌ వద్ద రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బాయిల్డ్‌ రైస్‌ కొనం, రా రైసే కొంటామని కేంద్రం చెబితే కేసీఆర్‌ ఎందుకు ఒప్పుకుని సంతకాలు పెట్టారో చెప్పాలి. వరి కుప్పల మీదే రైతుల గుండె ఆగుతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడిన చందంగా వ్యవహరిస్తోంది.

ఈ వానాకాలంలో 40 లక్షల టన్నుల ధాన్యం తీసుకోవడానికి ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉన్నా ఎందుకు కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదో చెప్పాలి. పంట మార్పిడి అంటే.. బట్టలు, మంత్రులను మార్చుకున్నంత సులువు కాదు. రైతుకు తెలియదా ఏ పంట వేసుకోవాలో.. వ్యవసాయం కూడా దొర బాంచెన్‌ అని మీ కాళ్లు మొక్కుతా అని ప్రాధేయపడి చేసుకోవాల్నా. రైతులు, పంటల బాధ్యత కేసీఆర్‌దే. అన్నదాతలు ఇతర పంటలు వేసుకునే వరకు వరి కొనాల్సిందే’అని డిమాండ్‌ చేశారు. 

ఢిల్లీలో ధర్నా చేయండి.. 
‘కేసీఆర్‌కు దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు, ప్రెస్‌మీట్‌లు పెట్టాలి. అది చేత గాక ఇక్కడ ఆందోళన నిర్వహిస్తారా. ఆంక్షలు పెట్టిన రోజునే ఢిల్లీలో ధర్నా చేయకుండా.. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెడితే ఏ ప్రయోజనం. ప్రజలు మీకు అధికారమిచ్చింది ధర్నాలు చేసేందుకేనా. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఎరువుల ధరలు 50శాతం పెరిగాయి. ఆ భారమంతా రైతుల మీదే పడింది. ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణాకు కేంద్రం నిధులిస్తుంది.

ఆఖరికి హమాలీలకు కూడా. మరి కేసీఆర్‌ ఆ నిధులను దేనికి ఖర్చుపెడుతున్నారో చెప్పాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్‌టీపీ చేపట్టిన రైతు వేదన నిరాహార దీక్ష ఆదివారం నుంచి లోటస్‌పాండ్‌లో కొనసాగిస్తాం. ధర్నా చౌక్‌లో 72 గంటల పాటు దీక్ష చేపట్టేందుకు అనుమతి ఇవ్వని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’అని షర్మిల స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు