కేసీఆర్‌కు అమ్ముడుపోయిన విపక్షాలు 

15 Aug, 2022 01:46 IST|Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల  

మద్దూరు: తెలంగాణలో కేసీఆర్‌ పాలనపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నించకపోవడం వల్లే రాష్ట్రంలోని ప్రజాసమస్యలు తెలియజెప్పడానికే వైఎస్సార్‌టీపీ ప్రజాప్రస్థాన యాత్ర చేపట్టిందని పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రతిపక్ష పార్టీలు అమ్ముడు పోయాయని ఆరోపించారు. ఆదివారం మద్దూరు నుంచి షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ప్రారంభించారు. మద్దూరు పాతబస్టాండ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెండుసార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే.. ఆయన ప్రజలకు చేసింది మోసమేనన్నారు.

నిరుద్యోగ భృతి అని మోసం, డబుల్‌ బెడ్‌రూం అని మోసం, రైతు బంధు పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు అత్మహత్య చేసుకుంటే సీఎంకు సోయి లేకుండా పోయిందని విమర్శించారు. బంగారు తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికి, కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ బంగారం కాలేదన్నారు. తెలంగాణలో అప్పు లేని కుటుంబం లేదని, అంతా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యంగా మార్చారని, ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కేసీఆర్‌ బయటకు రారని ఆరోపించారు.

ప్రజారంజక పాలన అందించిన దివంగత మహానేత వైఎస్సార్‌ బిడ్డగా మాట ఇస్తున్నా.. మళ్లీ రాజశేఖరరెడ్డి సుపరిపాలన తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది వృద్ధులుంటే అంతమందికి పింఛన్, మహిళ పేరు మీద కుటుంబానికి పక్కా ఇళ్లు, నిరుద్యోగులకు కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు