YS Sharmila: చేతకాకపోతే గద్దె దిగు

27 Oct, 2021 01:56 IST|Sakshi
దీక్షకు మద్దతుగా వచ్చిన మహిళలను పలకరిస్తున్న వైఎస్‌ షర్మిల 

సీఎం కేసీఆర్‌పై షర్మిల ధ్వజం 

నిరుద్యోగులను నిండా ముంచారు

తన కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చారు

తిమ్మాపూర్‌లో నిరుద్యోగుల నిరాహార దీక్ష 

కందుకూరు: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక పోతే దిగిపోవాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను నిండా ముంచారని, టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగు తోందని మండిపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం ఉదయం అగర్‌ మియాగూడ నుంచి తిమ్మాపూర్‌కు చేరుకుంది. అక్కడ నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఊడిపడ్డ తన బిడ్డలకే కేసీఆర్‌ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిజామాబాద్‌లో తన కుమారై ఉద్యోగాన్ని జనాలు ఊడకొడితే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు.

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కు సోయిలేదని, దున్నపోతు మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ పాలనలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పారు. ఐదేళ్ల పాలనలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, 2008లో డీఎస్సీతో 54 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌.. లిక్కర్‌తోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్న కేసీఆర్‌ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలన్నారు. ‘నక్కలు ఎరుగని బొక్కలు లేవు, నాగులు ఎరుగని పుట్టలు లేవన్న’ చందంగా కేసీఆర్‌ పాలన ఉందని ఎద్దేవా చేశారు.

ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3.85 లక్షల ఖాళీలను సైతం భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. అంతకుముందు షర్మిల వైఎస్సార్, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా బుధవారం రాచులూరు, గాజులబురుజుతండా, బేగంపేట, మాదాపూర్‌ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చేరుకోనుంది. 

>
మరిన్ని వార్తలు