నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే..

4 Aug, 2021 01:33 IST|Sakshi
దీక్షా వేదికపై ఓ చిన్నారిని ముద్దు చేస్తున్న షర్మిల. చిత్రంలో ఇందిరాశోభన్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదాకా కొనసాగించాలి 

గొల్లపల్లె దీక్షలో వైఎస్‌ షర్మిల 

సిరిసిల్ల:  రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదాకా దీనిని కొనసాగించాలన్నారు. ఎన్నికల సమయంలో రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఆయనకు మానవత్వం లేదని, అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. గొల్లపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన ముచ్చర్మ మహేందర్‌ యాదవ్‌ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్‌ ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఖాళీలతో కలిపి మొత్తం 3.85 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు అయ్యిందన్నారు. 

రుణమాఫీ అంటే వైఎస్సార్‌దే 
రైతులకు రుణమాఫీ అంటే దివంగత నేత వైఎస్సార్‌ చేసిందేనని షర్మిల చెప్పారు. ఆయన ఒకే సారి రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. దీనితో పాటు ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ఇప్పుడు రైతులు రుణమాఫీలు లేక వడ్డీలు కడుతున్నారని తెలిపారు. 2 లక్షల పెన్షన్లను రద్దు చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ముష్టి రూ.35 వేలు ఇస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు మహేందర్‌ యాదవ్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.   

మరిన్ని వార్తలు