ఒకరు 38 ఏళ్లకు 38 ఓట్లతో.. మరొకరు 9 ఓట్లతో

26 Jul, 2021 10:06 IST|Sakshi
జుజ్జవరపు విజయనిర్మల , పప్పు ఉమామహేశ్వరరావు

పంకా.. విజయ ఢంకా 

ఏలూరు కార్పొరేషన్‌ వైఎస్సార్‌ సీపీదే 

50లో 47 స్థానాలు కైవసం 

అఖండ విజయంతో శ్రేణుల సంబరాలు 

సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజల విశ్వాసానికి ప్రతీక  

మూడు స్థానాలకే పరిమితమైన టీడీపీ 

జనసేన అడ్రస్‌ గల్లంతు

హేలాపురిలో ‘ఫ్యాన్‌’ విజయభేరి మోగింది.. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనకు పట్టం కట్టేలా నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పుచెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ సరికొత్త చరిత్రను లిఖిస్తూ విజయదుందుభి మోగించింది. 50 స్థానాలకు గాను 47 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష టీడీపీ మూడు స్థానాలకు పరిమితం కాగా జనసేన, బీజేపీ కూటమి బోణీ కూడా కొట్టలేకపోయాయి.  

సాక్షి, ఏలూరు టౌన్‌: ఏలూరు నగరపాలక పీఠంపై వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రభంజనం కొనసాగగా తాజాగా ఏలూరు మేయర్‌ పీఠం సైతం వైఎస్సార్‌సీపీకే దక్కింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా రికార్డు విజయాలు నమోదుకావడం గమనార్హం. 30వ డివిజన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పప్పు ఉమామహేశ్వరరావు 38 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ టీడీపీ అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983 నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ రాగా ఈసారి ఓటమి చవిచూశారు. ఇక16వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జుజ్జవరపు విజయనిర్మల తన సమీప స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి సంతోషమ్మ కంటే 9 ఓట్ల ఆధిక్యం సాధించారు. రీకౌంటింగ్‌ జరిపినా ఫలితంలో మార్పు లేకపో వడంతో విజయనిర్మలను విజయం వరించింది. పలు స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీ సాధించగా టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల మాత్రమే నామమాత్రపు మెజార్టీలో గెలుపొందారు.  

అంబరాన్నంటిన సంబరాలు 
పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కార్పొరేటర్‌ అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబర్చడంపై ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్, పార్టీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు తన అనుచరులతో పెద్ద ఎత్తున వేడుక చేసుకున్నారు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. విజయం సాధించిన అభ్యర్థులు సైతం సంబరాల్లో మునిగితేలారు. 

జనసేన ఒక్కచోటా నిలవలేదు 
జనసేన 20 చోట్ల అభ్యర్థులను బరిలో నిలపగా కనీసం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నా వీరికి ఫలితం కానరాలేదు. నగర ఓటర్లు జనసేన అడ్రస్‌ను గల్లంతు చేశారు. చివరకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అద్దెకు తెచ్చుకుని ప్రచారం చేయించుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది.  

ప్రశాంతంగా కౌంటింగ్‌ 
ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రశాంతంగా జరిగాయి. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ పూర్తిస్థాయిలో కోవిడ్‌ నిబంధనల పాటిస్తూ అధికారులు ప్రక్రియ పూర్తిచేశారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించా రు. జాయింట్‌ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, జి.సూరజ్‌ ధనుంజయ్, ఏలూరు ఆర్డీఓ పి.రచన, ఏలూరు నగర కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.  

మూడంచెల భద్రత 
జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రత్యేక పర్యవేక్షణలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌ నేతృత్వంలో ఐదుగురు డీఎస్పీలు, 15 మంది ఎస్సైలు, సీఐలు, 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.  30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక  మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను ఈనెల 30న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమాయత్తమయ్యింది.   

అందరికీ ధన్యవాదాలు: కలెక్టర్‌ 
ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు