బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం  

15 Mar, 2021 06:32 IST|Sakshi
తిరుపతిలో విజయోత్సవం

చిత్తూరు జిల్లాలో చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ 

2 కార్పొరేషన్లు, 5 మునిసిపాలిటీలు కైవసం

అంబరాన్నంటిన అభిమానుల సంబరం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొట్టింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో విజయ ఢంకా మోగించింది. అలాగే మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, నగరి మునిసిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. పుంగనూరు మునిసిపాలిటీని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల పరిధిలో 217 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 197 స్థానాలను కైవసం చేసుకుంది. వార్డు, డివిజన్లతో కలిపి టీడీపీ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. 

సాక్షి, తిరుపతి: జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో క్లిన్‌స్వీప్‌ చేసి తిరుగులేని శక్తిగా నిలిచింది. 19 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత మొదటిసారి జరిగిన తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కంచుకోటగా పిలుచుకునే ఈ నగరంలో టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. మొత్తం 50 డివిజన్లలో 22 ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు.

ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఒక డివిజన్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉంది. 35వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ 126 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి క్యాన్సర్‌తో మంచం పట్టి పెద్దగా ప్రచారం చేయలేకపోయినా గట్టి పోటీనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు వెంకటకీర్తి పోటీచేసిన 18వ డివిజన్, తుడా మాజీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ సోదరుడు కృష్ణాయాదవ్‌ పోటీచేసిన 3వ డివిజన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జ్యోత్స్న పోటీచేసిన 15వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

టీడీపీ కంచు కోటలు బద్దలు 
జిల్లా కేంద్రమైన చిత్తూరు కార్పొరేషన్‌ కాంగ్రెస్, టీడీపీకి కంచుకోట. చిత్తూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎంపీ సీఎం రమేష్‌ వంటి అగ్రనాయకులంతా ఈ నగరంలోనే నివాసం ఉంటున్నారు. వీరంతా కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. డబ్బు, మద్యంతోపాటు బంగారు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, చీరలు పంపిణీ చేశారు. అయినా స్థానిక ఓటర్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకే జై కొట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి సొంత నియోజకవర్గమైన పలమనేరు మునిసిపాలిటీలో వైఎస్సార్‌సీపీ రెపరెపలాడింది.

ఇక్కడ మొత్తం 26 వార్డులకుగాను ఏకగ్రీవాలతో కలుపుకుని 24 వార్డులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. 2 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కుప్పం పక్క నియోజకవర్గం అయినా చంద్రబాబు ప్రభావం పెద్దగా కనిపించలేదు. మదనపల్లె మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. 33 వార్డులు వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ ఉంటున్న 27వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ కరీముల్లా 507 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుంది.  

వికసించని కమలం 
మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పలుచోట్ల పోటీ చేసినా ఒక్క చోటా బోణీ చేయలేకపోయింది. తిరుపతిలో ఎనిమిది, నగరి, పుత్తూరులో ఆరు వార్డులు, పలమనేరులో ఒక చోట ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. అక్కడా నామమాత్రపు ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయారు.  తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో ఎనిమిది మంది  బీజేపీ అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లు 2,546 మాత్రమే. అదేవిధంగా జనసేన తరుఫున తిరుపతిలో రెండు డివిజన్లలో పోటీచేస్తే ఇద్దరికీ కలిపి వచ్చిన ఓట్లు 231 మాత్రమే.

డబ్బు పోసినా.. ఫ్యాన్‌గాలికి తలవంచాల్సిందే 
నగరి, పుత్తూరు మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌, అతని  అనుచరులు  తీవ్రంగా ప్రయ   తి్నంచారు. ఈ మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు అమెరికాలో ఉన్న టీడీపీ శ్రేణులు డబ్బు సంచులతో చేరుకున్నాయని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకూ రాని వారు సైతం వచ్చి అహరి్నశలు శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రెండు మునిసిపాలిటీలను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. ఇటీవల మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 10 గంటలు రేణిగుంట విమానాశ్రయంలో హైడ్రామా చేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకే జై కొట్టారు.

చదవండి:
మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్'‌ తుపాన్  
తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు? 

మరిన్ని వార్తలు